సాక్షి, అమరావతి: ‘రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు చోటు చేసుకోవడంపై లోకాయుక్త, సీఐడీ, సీబీఐలలో ఏదో ఒక సంస్థతో దర్యాప్తు చేయించాలని శుక్రవారం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని గత పాలకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పలు రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లభ్యం కావడంతో మరింత లోతుగా సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో జరిగిన కుంభకోణంపై మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. రాజధాని వ్యవహారంలో చాలా తప్పులు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న సంస్థ కూడా ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్‌కు ముందు (రాజధాని ఈ ప్రాంతంలో వస్తుందని అధికారికంగా ప్రకటించడానికి ముందు) భూములు కొనుగోలు చేసిన విషయం బట్టబయలైందని చెప్పారు. రాజధాని ప్రకటించడానికి కొంత ముందు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు ఆ ప్రాంతంలో భూములు కొన్నారో పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
కచ్చితంగా బయట పెడతాం
‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. నైతిక విలువలు వదిలేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ నెలాఖరు మధ్య (రాజధాని ఎక్కడ పెడతారో ప్రకటించక ముందు) టీడీపీ నేతలు ఇక్కడ 4,075 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇలా చేయరాని తప్పులు చేసిన వారే ఇప్పుడు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. రైతులను రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే అక్రమాలు నిరూపించాలని సవాలు చేస్తున్నారు. జరిగిన తప్పును ఎవరూ దాచలేరు. అందుకే మొత్తం వ్యవహారంపై లోకాయుక్త లేదా సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెచ్చగొడుతూ.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తున్న పెద్ద మనుషుల కోరికను తప్పకుండా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎవరెవరు ఏమేరకు అక్రమాలకు పాల్పడ్డారో అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయి’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment