డిస్కౌంట్ ధరలో అపూర్వ చిత్రాలు
సాక్షి, సిటీబ్యూరో: పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన ‘70 ఏళ్ల స్వాతంత్య్రం – త్యాగాలను స్మరిద్దాం’ ఫొటో ఎగ్జిబిషన్ అరుదైన దృశ్యాల వేదికగా నిలుస్తోంది. దేశమంతా ఏకమై బానిస సంకెళ్లు తెంచిన ఘట్టాల చిత్రాలు అందరిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.1857 నుంచి మొదలైన స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని స్వేచ్ఛా వాయువులు లభించిన 1947 ఆగస్టు 15 వరకు, తదనంతరం దేశంలో చోటుచేసుకున్న పరిణామాల దృశ్యమాలిక అందరినీ కట్టిపడేస్తోంది. కేవలం అరుదైన ఫొటోలే కాకుండా.. అపూర్వమైన పుస్తకాలూ కొలువు దీరాయి. మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుల విజయగాథలు, జీవితచరిత్ర తదితర పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వీటిని డిస్కౌంట్ ధరకు సృదర్శకులకు విక్రయిస్తున్నారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వెళ్లొచ్చు. ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాల్లో భాగంగా 1857 సెప్టెంబర్ 14న కమాండర్ కేంపీబెల్ సేనల దాడిలో ఛిద్రమైన కాశ్మీర్ గేటుతోపాటు స్వాతంత్య్ర తొలి వేడుకలు, సైనికులు కవాలు, విద్యుత్ వెలుగుల్లో ఢిల్లీ గేట్, తొలి కేబినెట్ భేటీ, తొలి రాష్ట్రపతిగా, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోన్నతులు, కార్గిల్ యుద్ధ చిత్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముద్ర, సంస్థానాల విలీనం, దేశానికి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులుగా పనిచేసినవారి ఫొటోలు ప్రదర్శనలో ఉంచారు.