స్థానిక యువకులతో కలిసి మొక్కలు నాటుతున్న శ్రీనివాసరావు
దారి నడుమ హరిత పతాకాలు
Published Sat, Jul 23 2016 7:48 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
జాతీయ రహదారికి పచ్చదనాన్ని అద్దుతున్న యువ నర్సరీరైతు
డివైడర్‌పై స్వచ్ఛందంగా మెుక్కలు నాటుతున్న శ్రీనివాసరావు
కడియపులంక–బుర్రిలంకల మధ్య 500 ఫాక్స్‌టైల్ మెుక్కలు
ఆయన స్ఫూర్తితో ముందుకొస్తున్న ఇతర రైతులు
కడియపులంక (కడియం) : కడియపులంక–బుర్రిలంకల మధ్య 16వ నంబరు జాతీయ రహదారిపై రెండురోజుల క్రితం ప్రయాణించిన వారు.. తిరిగి ఇప్పుడు ఆ దారిన వస్తే కళ్లింతలు చేసుకుని ఆశ్చర్యపోవలసిందే. కారణం.. రెండురోజుల వ్యవధిలోనే రహదారి సెంట్రల్ డివైడర్‌పై హరితకేతనాల్లా అంతెత్తున వెలసిన ‘వృక్షాలే’! అవును..మెులకలూ, మెుక్కలూ కాక.. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆరడుగుల నుంచి 15 అడుగుల ఎత్తు వరకూ ఉండే భారీ మెుక్కలు బారులు తీరాయి. సువిశాలమైన బాటకు సరికొత్త సోయగాలు అద్దాయి. ఆ పచ్చనికేతనాల్ని దారి నడుమ పొదిగిన వాడు ఓ యువకుడు. ఉద్యానవనసీమగా విఖ్యాతి గాంచిన కడియం ప్రాంతంలో ఆ పసిమీ, మిసిమీ నర్సరీల్లో తప్ప మిగిలిన చోట్ల కానరావేమన్న ఇతర ప్రాంతాల వారి ప్రశ్నే అతడిలో ఈ సంకల్పానికి బీజం వేసింది. కడియపులంకకు చెందిన శ్రీలక్ష్మీ నారాయణ నర్సరీ గార్డెన్స్ అధినేత తిరుమలశెట్టి గంగరాజు కుమారుడు శ్రీనివాసరావు.. కడియపులంక–బుర్రిలంకల నడుమ జాతీయ రహదారి డివైడర్‌పై శుక్రవారం నుంచి ఫాక్స్‌టైల్ మెుక్కలను నాటుతున్నారు. రెండూళ్ల నడుమా ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఇలా 500 మెుక్కలను నాటాలన్నది తన లక్ష్యమని శ్రీనివాసరావు చెప్పారు.
ప్రశ్నతో మెులకెత్తిన ఆలోచన
ఎక్కడెక్కడి నుంచో కడియపులంక ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ ప్రాంతంలో నర్సరీల్లో తప్పితే ఇతర చోట్ల మొక్కలు లేకపోవడాన్ని గురించి ప్రశ్నించేవారు. వారి ప్రశ్న సబబేనని భావించిన శ్రీనివాసరావులో ఆ లోటు తీర్చడానికి తన వంతు కృషి చేయాలన్న పట్టుదల పెరిగింది. కడియపులంక–బుర్రిలంకల మధ్య హైవే డివైడర్ వెంబడి మొక్కలను నాటి సుందరీకరించాలనుకున్నారు. ఆయన ఆలోచనను తండ్రి గంగరాజు, స్నేహితులు మెచ్చి వెన్నుతట్టారు. వెంటనే కార్యరంగంలో దిగిన శ్రీనివాసరావు శుక్రవారం మెుక్కలు నాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నాటుతున్న ఫాక్స్‌టైల్ మెుక్కలు ఒక్కోటీ రూ.600 ఖరీదైనవి. తమ నర్సరీల్లో ఉన్న ఆ రకం మెుక్కలు చాలకపోవడంతో ఇతర నర్సరీల నుంచీ కొనుగోలు చేసి తెచ్చి మరీ కూలీలతో నాటిస్తున్నారు. శ్రీనివాసరావు పూనుకుని చేస్తున్న బృహత్కార్యక్రమం తోటి నర్సరీ రైతులను ఆకర్షించింది. ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, స్థానిక నర్సరీ రైతులు మల్లు పోలరాజు, నాగిరెడ్డి రామకృష్ణ, పెనుమాక కొండయ్య, కర్రి ఎస్సయ్య తదితరులు శ్రీనివాసరావును కలిసి అభినందించారు.
రహదారి రమణీయ బృందావనమవుతుంది..
దేశం నలుమూలలకు మొక్కలను ఎగుమతి చేసి, పచ్చదనం నింపడంలో కడియం ప్రాంత ప్రజల కృషి ఎనలేదనిది. అయితే మన ప్రాంతంలో నర్సరీల్లో కనిపించే పచ్చదనం, వన్నెల్లో కొంత శాతమైనా.. బయట కనిపించకపోవడం నిజమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఇదే విషయంపై ప్రశ్నించేవారు. దాంతోనే నాకీ సంకల్పం కలిగింది. తొలి విడతగా కడియపులంక – బుర్రిలంక గ్రామాల మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. ఒక్కోటీ రూ.600 విలువైన 500 మొక్కలు అవసరమవుతాయని అంచనా వేసాం. ఇందుకోసం సుమారు రూ.మూడు లక్షల వరకు ఖర్చవుతుంది. ఇలా మొక్కలు నాటుదామన్న ఆలోచన పలువురు నర్సరీ రైతులకు ఉన్నా వివిధ కారణాలతో ముందుకు రాలేకపోయారు. అయితే ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు కూడా ఉత్సాహపడుతున్నారు. కడియం మండలం వేమగిరి నుంచి ఆలమూరు మండలం మడికి గ్రామం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర హైవే డివైడర్‌ను సుందరీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాము కూడా మొక్కలు నాటేందుకు తోడ్పాటునందిస్తామని చెబుతున్నారు. వారందరూ చెÄæ్యూ వేస్తే హైవే అందమైన బృందావనంగా మారిపోతుంది.
– తిరుమలశెట్టి శ్రీనివాసరావు
Advertisement
Advertisement