గ్రూప్–2 పోస్టులు పెంచాలి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్–2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను 750 నుంచి రెండు వేలకు పెంచాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరండల్‌పేటలోని వావిలాల సంస్థలో గుంటూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్–2 అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రూప్–2 సిలబస్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, స్క్రీనింగ్ పరీక్షలో కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను 150 మార్కులకు పొందుపర్చారని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్‌లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలైన రాజధాని నిర్మాణం, నదీ జలాల పంపిణీ, ఉద్యోగుల విభజన, విభజన చట్టం హామీలు తదితర అంశాలను చేర్చారని పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్ బి. మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్రుల చరిత్రను శాతవాహనుల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ అధ్యయనం చేయాలని సూచించారు. అర్ధశాస్త్ర అధ్యాపకుడు మునుస్వామి మాట్లాడుతూ భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థలపై 15 ప్రశ్నలు ఉంటాయని, సమకాలీన ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ ప్రశ్నలు రావచ్చని తెలిపారు. సదస్సులో జీవశాస్త్ర అధ్యాపకుడు ఫణికుమార్, అధ్యాపకులు ప్రభాకర్, సుబ్బారావు, నిరుద్యోగులు పాల్గొన్నారు.