
'మంత్రికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదు'
పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం సరికాదని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు గుణంపల్లి రాఘవరెడ్డి పేర్కొన్నారు.
గుంతకల్లు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం సరికాదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు గుణంపల్లి రాఘవరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో జరుగుతున్న వీహెచ్‌పీ దక్షిణాంధ్ర వర్షాకాల సమావేశాలకు విచ్చేసిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
పుష్కరాల్లోనే కాకుండా అన్ని ఆలయాలూ ‘చంద్ర’మయం అయ్యాయని సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాగా గోసంరక్షణ, మతమార్పిడి, అంటరానితనం, అస్పృశ్యతలను అరికట్టి దళితులందరికీ ఆలయం ప్రవేశం చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సేవాబస్తీ(దళిత వాడ)ల్లో నిత్యం సత్సంగాలు నిర్వహించి మతమార్పిడులను అరికట్టడమే లక్ష్యంగావిశ్వహిందూ పరిషత్ పనిచేస్తోందని ఆయన చెప్పారు.