గురుభ్యోనమః
హిందూ సమాజంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ ఈ మూడింటినీ అందించగలిగే వారే గురువు. ఒక అంశాన్ని మనకు బోధించి, ఆ రంగంలో జ్ఞానాన్ని ప్రసాదించేవారందరూ గురువులే. గురు అంటే మాయను నిర్మూలించి, జ్ఞాన మార్గాన్ని నడిపించేవారని అర్థం. ఇది కేవలం ఆధ్యాత్మిక భావనతోనే చెప్పినదికాదు. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజును హిందువులు గురుపౌర్ణమి రోజుగా పాటిస్తారు. ఈ పర్వదినాన గురువును ప్రతి ఒక్కరూ ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని ప్రతీతి. జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, సాయి సత్యవ్రతాలు జరిగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీలు, దాతలు భక్తులకు అన్నదానం నిర్వహించారు.