కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వేస్ట్ ఫెలోస్‌గా అభివర్ణించిన వారందరూ ఇప్పుడు బెస్ట్ ఫెలోస్ ఎలా అయ్యారో అర్థం కావడం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వేస్ట్ ఫెలోస్‌గా అభివర్ణించిన వారందరూ ఇప్పుడు బెస్ట్ ఫెలోస్ ఎలా అయ్యారో అర్థం కావడం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన బహిరంగ సభలో కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కరచాలనం చేసుకుని సంభాషించుకున్న వైనంపై ఎంపీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రూ.20 లక్షలు ఖర్చు పెట్టి నిర్వహించిన ఆ సభలో తనతో పాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు పేర్లనే జపించారని చెప్పుకొచ్చిన ఆయన వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా మునిగిపోవడానికి పన్నెండు, పదమూడు మంది నాయకులు కారుకులయ్యారని, వారిలో కొందరు మిర్యాలగూడలో జరిగిన సభలో కూడా పాల్గొన్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్రానికి కాబోయే సీఎంలు తామేనని ప్రగల్భాలు పలికి చిట్టచివరికి పార్టీనే ముంచారన్నారు. ఇలాంటి పంచాయితీల వల్ల పార్టీ నష్టపోతుందని, దీనిని చూసుకోవాల్సిందిగా సోనియాగాంధీకి లేఖ కూడా రాసినట్లు ఎంపీ చెప్పారు. కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ అధినేత ఉత్తమ్ పెట్టే బాధ భరించలేకనే జానారెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పారన్నారు. ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం ఎందుకని చెప్పి తామే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.