ఎన్‌ఆర్‌ఐలో అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
పోతవరప్పాడు (ఆగిరిపల్లి) : కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లోని కళాశాలలకు చెందిన బాలబాలికలకు హ్యాండ్‌బాల్ ఆటల పోటీలకు సంబంధించి ఎంపిక పోతవరప్పాడులోని ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించారు. కాకినాడ జేఎన్‌టీయూ స్పోర్ట్స్ సెలక‌్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో 225 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆర్.వెంకట్రావు మాట్లాడుతూ నేటి యువతకు విద్యతో పాటు క్రీడలు అవసరమన్నారు. పోటీ ప్రపంచంలో క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రిన్సిపాల్ సి.నాగభాస్కర్ సూచించారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని జేఎన్‌టీయూకే క్రీడా కార్యదర్శి శ్యామ్‌కుమార్, సెలక‌్షన్ కమిటీ బృందం సభ్యుడు డి.హేమంద్రరావు, ఎ.సుధాకరరావు పరీక్షించి 16 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ ఎంపికల్లో ఎన్‌ఆర్‌ఐ కళాశాలకు చెందిన నలుగురు బాలురు, ఐదుగురు బాలికలు తుది జట్టులోకి ఎంపికైనట్లు కళాశాల పీడీ పి.గౌతు పేర్కొన్నారు.