ప్రభుత్వం ఇచ్చిన పట్టా చూపుతున్న ప్రకాష్
సర్కిల్ ఏర్పాటు కోసం ఇల్లు కోల్పోతున్న దివ్యాంగుడి ఆవేదన
కుప్పం: ‘ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సర్కిల్ ఏర్పాటు అంటూ ఇంటినే ఖాళీ చేయమంటున్నారు. కుదరదంటే బలవంతంగానైనా ఖాళీ చేయిస్తాం అంటున్నారు. న్యాయం కోసం మూడు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ దివ్యాంగుడు, హార్మోనియం కళాకారుడైన ప్రకాష్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. పట్టణ సమీపంలోని దళవాయికొత్తపల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రకాష్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. 1982లో ఈయనకు ప్రభుత్వం గృహాన్ని మంజూరు చేసింది.
అప్పట్నుంచి దళవాయికొత్తపల్లె సమీపంలోని ఎస్‌టీ కాలనీలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఇదిలాఉంటే, ప్రకాష్ ఇంటి పక్కన మూడు రోడ్ల కూడలి ఉండటంతో సర్కిల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే పడగొడతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న తమను ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమనడంతో దిక్కుతోచడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఉన్నది కేవలం ఒక ఇల్లు మాత్రమే.. దీన్ని కూడా స్వాధీనం చేసుకుంటే తాము చెట్ల కింద జీవనం సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. న్యాయం కోసం మూడు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకొనే నాథుడు లేడని విలేకరుల ఎదుట వాపోయాడు. తాము నివసించేందుకు ప్రత్యామ్నాయం చూపాలని సంబంధిత అధికారులను వేడుకున్నాడు.