జార్ లిఫ్టింగ్‌లో రెండు ప్రపంచ రికార్డులు సాధించి వరల్డ్ విజేతగా నిలిచింది 31 ఏళ్ళ అంజు రాణి. దివ్యాంగురాలైన అంజురాణి జార్ లిఫ్టరే కాదు థియేటర్ ఆర్టిస్ట్, రైటర్, మోడల్, బిజినెస్ ఉమన్, సోషల్ వర్కర్ కూడా. మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్న అంజురాణి రెండు దక్షిణ భారత చిత్రాల్లోనూ నటించింది. కేరళలోని ఎర్నాకులం వాసి అయిన అంజురాణి రెండు చేతులతోనూ ఒకే స్పీడ్‌తో అదీ అద్దంలో చూస్తూ రాయగలదు. దేశంలో మొట్టమొదటి వీల్ చైర్ ఆర్టిస్ట్ కూడా అంజురాణియే. వన్‌గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని స్వయంగా తయారు చేస్తూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటుంది. అలా వచ్చిన డబ్బుతో తనలాంటి దివ్యాంగులకు సాయం చేస్తుంది.
ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ముందుకు సాగడానికి అంజురాణి లాంటివాళ్లు మనలో ధైర్యాన్ని నింపుతారు. ఒక అమ్మాయి అత్యున్నత దశకు చేరుకోవడానికి చేసిన పోరాటాన్ని అంజు వివరిస్తూ.. ‘నాకు పుట్టుకతోనే పారాప్లేజియా (వెన్నుపూసకు వచ్చిన వ్యాధి) వల్ల శరీరం దిగువ భాగం పనిచేయడం ఆపేసింది. శరీర లోపం ఉన్నప్పటికీ మానసికంగా నేను ధైర్యవంతురాలిని. నాకు నేనుగా బతకే సై్థర్యాన్ని పెంచుకోవాలనుకున్నాను. అందుకు నా తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు..’ అంటూ తన గురించి తెలిపింది అంజు.
మొదటి వీల్ చైర్ ఆర్టిస్ట్
దేశంలో వీల్ చైర్ ఆర్టిస్ట్ టీమ్ ‘ఛాయ’లో మొట్టమొదటి సభ్యురాలు అంజు. ఇప్పటివరకు చాలా ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంది. రెండు దక్షిణ భారత దేశ సినిమాల్లోనూ నటించింది. ‘పలావి ప్లస్’ యూ ట్యూబ్ ఛానెల్ మీడియా డైరెక్టర్ పనిచేస్తోంది. దీని ద్వారా దివ్యాంగులలోని ప్రతిభను వెలికి తీసూ, వారికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ ఇస్తోంది. వికలాంగుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడమే తన కలగా చెబుతుంది అంజు.
ఇంటి నుండే చదువు..
అంజు తండ్రి పేరు జాయ్, తల్లి జెస్సీ. అంజు పుట్టినప్పుడు ఆమెకున్న ఈ వ్యాధి గురించి డాక్టర్లు చెప్పారు. దాంతో ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటో అని ఆందోళన చెందాడు తండ్రి. కాని ఆమె పెరుగుదలలో ఏ లోపం రాకుండా ప్రతి సందర్భంలోనూ అంజుకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. కేరళలోని ఇడుక్కి రాష్ట్రంలో స్పోర్ట్స్ టీచర్. అయిన జాయ్, తనతో పాటు రోజూ అంజును స్కూల్‌కి తీసుకువెళ్ళేవాడు. అలా అంజు అక్కడ నాల్గవ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత అంజు ఇంట్లో ఉండే స్కూల్ చదువును కొనసాగించింది.
ఆ తర్వాత ఓపెన్ యూనివర్శిటీ ద్వారా సోషియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. టీవీ చూస్తున్నప్పుడు ఓ కార్యక్రమంలో ఒక వ్యక్తి జార్ లిఫ్టింగ్ చేస్తున్నట్లు చూసిన అంజు తనూ అలాంటి పోటీలో పాల్గొనాలనుకుంది. అందుకోసం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. సాధనతోనే రెండు బరువైన జాడీలను ఒకేసారి ఎత్తే కళను నేర్చుకుంది. కేజీ బరువున్న జార్‌ను ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు వేళ్ళతో పట్టుకోవాలి. దీనికి యూనివర్సల్ రికార్డ్ ఫోరం గుర్తింపు లభించింది. రెండు వేళ్ళతో రెండు కిలోల కూజాను ఎత్తి ప్రశంసలు, ప్రపంచ రికార్డులను పొందింది అంజు.
ఆన్‌లైన్ బొటిక్
అంజుకు ఆన్‌లైన్‌లో ‘లిసా క్వీన్ బొటిక్’ కూడా ఉంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ కూడా చేస్తుంటుంది. సమాజంలో ప్రజలు వికలాంగుల పట్ల తమ వైఖరిని మార్చుకోవాలని అంజు పలు అంశాల ద్వారా చూపుతుంది. ‘భగవంతుడు మనకు ఒక సాధారణ వ్యక్తికి సమానమైన సామర్ధ్యాలను ఇచ్చాడు. ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకోవాలి’ అంటోంది. కూతురు సాధించిన విజయాన్ని చూసి అంజు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆమె ఎదుగుదలలో ఎప్పుడూ వెన్నంటే ఉన్న జెస్సీ, జాయ్‌లు మాట్లాడుతూ– ‘మా కూతురే ఇప్పుడు మాకు బలం. మీ కుమార్తె దివ్యంగురాలు అయితే బాధపడకండి. ఆమె జీవితంలో విజయం సాధించడానికి తగినంత ప్రోత్సాహం ఇవ్వండి’ అని దివ్యాంగుల తల్లిదండ్రులకు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment