బధిరుల క్రీడా పోటీలు ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : డిసెంబర్ 3న అంతర్జాతీయ బుద్ధిమాంద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న బధిరుల క్రీడాపోటీలు స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులలో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీయడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ రవీంద్ర మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలను 114 ఈవెంట్లలో నిర్వహిస్తున్నామన్నారు.
మొదటిరోజు అంధ, బధిరులకు నిర్వహించామని, శనివారం బుద్ధిమాంద్యం, శారీరక వికలాంగులకు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు డిసెంబర్ 3న ఏర్పాటు చేసే కార్యక్రమంలో బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులను విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ స్వరూప, వడ్డెర్ల ఫెడరేషన్ చైర్మన్ దేవేళ్ల మురళి, పీఈటీలు పాల్గొన్నారు.
తూతూ మంత్రం...
ఈ క్రీడా పోటీలను నామమాత్రంగా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఏడీ ప్రారంభ కార్యక్రమం ముగియగానే వెళ్లిపోవడం, 114 ఈవెంట్లను కింది స్థాయి సిబ్బంది నాలుగైదు గంటల్లో పూర్తి చేయడం, ఏడీ లేకుండానే విజేతల వివరాలను ప్రకటించడం చూస్తే ఈ విమర్శలకు బలం చేకూరుతోంది.