neelam sanjeevareddy stadium
-
ఉత్సాహంగా అథ్లెటిక్ మీట్
అనంతపురం న్యూ సిటీ : నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ‘శివశంకర్ మెమోరియల్ అథ్లెటిక్ మీట్’ ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఓపెన్ అథ్లెటిక్స్ మీట్లో అండర్ –14, 18 బాలురు, అండర్ –15 బాలికలు 100, 200, 400, 800 మీటర్లు, మూడు కిలోమీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పోటీపడ్డారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఆకస్మికంగా మృతి చెందిన తోటి క్రీడాకారుడి స్మారకార్థం అథ్లెటిక్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్ స్వరూప, సీఐలు సాయిప్రసాద్, తబ్రేజ్, ఎస్ఐ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ టోర్నీకి సన్నాహాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నీకి సన్నాహాలు చేస్తున్నారు. అసోసియేషన్ సభ్యులు క్రీడా మైదానంలో కోర్టు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నీకి రాష్ట్రంలోని 16 జట్లు పాల్గొంటాయన్నారు. మొదటిసారి ఫ్లడ్‌లైట్ల వెలుగులో టోర్నీని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో కోచ్ జబీర్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఏర్పాట్లు
నేటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు అనంతపురం సెంట్రల్ : పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లనిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్వహణలో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 5,697 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. అభ్యర్థులు పీటీసీ తూర్పు గేటు ద్వారా లోపలికి ప్రవేశించి రిపోర్టింగ్ పాయింట్లో రిపోర్టు చేసుకోవాలన్నారు. అనంతరం అభ్యర్థులకు బ్రీఫింగ్ చేస్తారని, ఆ తర్వాత సర్టిఫికేషన్, లగేజీ పాయింట్ వద్దకు పంపడం, బయోమెట్రిక్ ద్వారా సరిచూడటం చేయాలన్నారు. అవి అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీటెస్టులో భాగంగా 1600 మీటర్ల పరుగు, ఆ తర్వాత లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా కూడా పొరపాట్లు, లొసుగులు జరగరాదన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం కొం దరు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులచే ఉదయం అల్పాహారం కింద బిస్కెట్లు, మధ్యాహ్నం పులిహోరా, పెరుగన్నం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు మల్లికార్జునవర్మ, మహబూబ్‌బాషా, వెంకటరమణ, నాగసుబ్బన్న, నర్సింగప్ప, చిదానందరెడ్డి, వెంకటరామాంజనేయులు, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ పాల్గొన్నారు. -
బధిరుల క్రీడా పోటీలు ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : డిసెంబర్ 3న అంతర్జాతీయ బుద్ధిమాంద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న బధిరుల క్రీడాపోటీలు స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులలో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీయడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ రవీంద్ర మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలను 114 ఈవెంట్లలో నిర్వహిస్తున్నామన్నారు. మొదటిరోజు అంధ, బధిరులకు నిర్వహించామని, శనివారం బుద్ధిమాంద్యం, శారీరక వికలాంగులకు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు డిసెంబర్ 3న ఏర్పాటు చేసే కార్యక్రమంలో బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులను విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ స్వరూప, వడ్డెర్ల ఫెడరేషన్ చైర్మన్ దేవేళ్ల మురళి, పీఈటీలు పాల్గొన్నారు. తూతూ మంత్రం... ఈ క్రీడా పోటీలను నామమాత్రంగా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఏడీ ప్రారంభ కార్యక్రమం ముగియగానే వెళ్లిపోవడం, 114 ఈవెంట్లను కింది స్థాయి సిబ్బంది నాలుగైదు గంటల్లో పూర్తి చేయడం, ఏడీ లేకుండానే విజేతల వివరాలను ప్రకటించడం చూస్తే ఈ విమర్శలకు బలం చేకూరుతోంది.