అనంతకు జీవనాధారం హంద్రీ-నీవా
గుంతకల్లు రూరల్ : హంద్రీ-నీవా కాలువ జిల్లాకు ప్రధాన జీవాధారం అని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. హంద్రీ-నీవా కాలువ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పనుల నిర్వహణలో సాధ్యాసాధ్యాలను పరిశీలించే క్రమంలో భాగంగా మంగళవారం ఆయన గుంతకల్లులో పర్యటించారు. నేరుగా బుగ్గ సంగాల సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్దకు చేరుకున్న ఆయన 144 కిలోమీటర్ నుంచి జి.కొట్టాల వరకు కాలువపై పర్యటించి పరిశీలించారు. కసాపురం, జి.కొట్టాల వద్ద ఏర్పాటు చేసిన తూములు పరిశీలించి అక్కడి నుంచి నీటిని ఏఏ ప్రాంతాలకు మళ్లిస్తున్నారు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్థానిక రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో నీటి సమస్యను అధిగమించడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే ఆధార పడాల్సి ఉందన్నారు. హంద్రీ-నీవా విస్తరణ పనులు పూర్తయితే జిల్లాకు 26 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నందున నీటి సమస్యను పూర్తిగా అధిగమించవచ్చన్నారు. 9.5 మీటర్ల మేర కాలవను విస్తరిస్తున్న నేపథ్యంలో పనుల నిర్వహణకు టెండర్లను కూడా ఆహ్వానించామని, ఈనెల 8 తరువాత వర్క్‌ఆర్డర్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేస్తామన్నారు. అనంతరం విలేకరులు కొన్ని సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
చెరువుల్లో పూడిక తీత పనులు చేపడతామని, ఇకపై ఉపాధి హామీలో అన్ని రకాల పనులు పెడతామన్నారు. జిల్లాలో రూ.67 కోట్ల వరకూ ఉపాధి కూలీల డబ్బు పెండింగ్‌లో ఉందని, త్వరలోనే వాటిని నేరుగా కూలీల ఖాతాలోకి జమ చేస్తామన్నారు. మండలాల్లో నీటి సమస్యలపై ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. బోర్లు, చేతి పంపుల మరమ్మత్తుల కోసం ప్రతి మండలానికి రూ.2 లక్షల చొప్పున ఎంపీడీఓ ఖాతాల్లో జమ చేశామని, వాటిని ఉపయోగించి నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ-నీవా కాలువ చీఫ్ ఇంజనీర్ జలంధర్, ఈఈ రాజశేఖర్, డీఈ రామకృష్ణ యాదవ్, తహశీల్దార్ హరిప్రసాద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.