గొటివాడలో నీలిమతో మాట్లాడుతున్న బుడితి చర్చి ప్రతినిధులు
గొటివాడ(జలుమూరు): ‘చిన్ని బతుకులు అంతులేని కష్టాలు’ అన్న శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు దాతలు స్పందిస్తున్నారు. తల్లితండ్రీ లేక చిన్నారులు అవస్థలు పడుతున్న తీరు చూసి చలించిపోతున్నారు. సారవకోట మండలం బుడితికి చెందిన కర్మేయిలు ప్రార్థన మందిరం ప్రతినిధులు, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్(ఐసీడబ్లూ్యఏ) మేనేజర్ నాగేశ్వరరావులు గురువారం గొటివాడ వచ్చి నీలిమ, అప్పలనాయుడు, వెన్నెలను చూశారు. చిన్నారులను తమ సంస్థ ద్వారా డిగ్రీ వరకు ఉచితంగా చదివిస్తామని, వారి పోషణ బాధ్యత అంతా చూసుకుంటామని తెలిపారు. జువైనల్ చైర్మన్ ఆదేశాల ప్రకారం చట్టబద్ధంగా వీరి బాధ్యతలను తాము తీసుకుంటామని చెప్పారు. దీనిపై స్థానికులతో చర్చించారు.
సాక్షి పత్రికలో వచ్చిన కథనం చదివిన తర్వాత చల్లవానిపేట అరుణోదయ విద్యాసంస్థల అధినేత కె.అప్పలనాయుడుతో పాటు చాలామంది దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని రెయ్యిమ్మ అనే మహిళ వారికి తెలిపారు. ఈ నెల 21న చల్లవానిపేట అరుణోదయ పాఠశాలలో సమావేశం నిర్వహించి అందులో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్ణయం ప్రకటిస్తామని స్థానికులు తెలిపారు. అలాగే మండల జన్మభూమి కమిటీ సభ్యులు బగ్గు గోవిందరావు, జలుమూరు సర్పంచ్ ప్రతినిధి కోన దామోదరావు, శ్రీముఖలింగం సర్పంచ్ ప్రతినిధి తర్ర బలరాం తోపాటు పలువురు స్పందించారు. వీరితోపాటు డాక్టర్ వినోద్, వార్డిన్ శ్రీనివాసరావు, ఐజెక్ పాఠశాల హెచ్‌ఎం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.