హర్తాళ్ సక్సెస్..
- ‘అనంత’లో భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు
- ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు..స్టేషన్లలోనూ కొనసాగిన నిరసనలు
- విద్యాసంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించి.. మద్దతు తెలిపిన యాజమాన్యాలు
అనంతపురంలో విపక్షాలు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాంబశివారెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం, సంయుక్తకార్యదర్శి నదీమ్‌తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో యువకులు ర్యాలీకి తరలివచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నగరం మొత్తం ర్యాలీ చేశారు. టవర్‌క్లాక్‌వద్ద నాయకులను పోలీసులు అరెస్టు చేసి.. రూరల్ స్టేషన్ కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో కూడా నగరంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీబస్టాండ్ ఎదుట బైఠాయించి.. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆపై వారు నగరంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం రాష్ట్రనేత ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు సీఐ శుభకుమార్ యత్నించగా, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ సీఐ కాళ్లుపట్టుకుని ర్యాలీకి సహకరించాలని కోరారు. గుంతకల్లులో తెల్లవారుజామున విపక్షనేతలు బీరప్పగుడి సర్కిల్‌లో రాస్తారోకో చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపై విద్యార్థులు, యువకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డిని గృహనిర్బంధం చేశారు. ధర్మవరంలో ప్రముఖ నేతలందరినీ ఇళ్లవద్ద అరెస్టుచేసి.. స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైక్‌ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్, వామపక్షాలు పట్టణంలో ర్యాలీ చేపట్టాయి. రాప్తాడులో విపక్షాలు బెంగళూరు హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశాయి. నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, బీఎస్‌పీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కర్ణాటక బ్యాంకు ఎదుట బైఠాయించారు. రాయదుర్గంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు.. స్థానిక వినాయక్‌సర్కిల్‌కు ర్యాలీగా చేరుకున్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. ఆపై వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ చేపట్టి.. గణేశ్‌సర్కిల్‌లో ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. శింగనమలలో విపక్షనేతలు సమష్టిగా ర్యాలీ చేశారు. బుక్కరాయసముద్రం, పుట్లూరులో ర్యాలీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. గార్లదిన్నెలో నేతలందరినీ ముందస్తు అరెస్టు చేశారు. కదిరిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ర్యాలీలో ఉండగా.. పోలీసులు మధ్యలోనే అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వామపక్ష, కాంగ్రెస్‌నేతలను కూడా అరెస్టు చేశారు. స్టేషన్లలో విపక్ష సభ్యులంతా కలిసి ధర్నా చేపట్టారు. మడకశిరలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం నేతలు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో విపక్షనేతలు వేర్వేరుగా ఆందోâýæనలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, రూ.2వేల జిరాక్స్ నోట్లను కాల్చి నిరసన తెలియజేశారు. ఆపై ధర్నా చేపట్టారు. నాయకులను పోలీసులు అరెస్టు చేసి..స్టేషన్ కు తరలించారు.స్టేషన్ లోనూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పెనుకొండలో విపక్షనేతలు వేర్వేరుగా ఆందోâýæన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీ చేస్తున్న వామపక్షసభ్యులను కూడా అరెస్టు చేశారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్‌సర్కిల్‌లో బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపై వామపక్షాలు, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారిని కూడా అరెస్టు చేశారు. కళ్యాణదుర్గంలో విపక్షనేతలు ర్యాలీ నిర్వహించారు. టీసర్కిల్‌లోరాస్తారోకో చేపట్టారు. నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
బస్సుల్లో తగ్గిన రద్దీ
అనంతపురం న్యూసిటీ: హర్తాళ్ ప్రభావంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గింది. సోమవారం అనంతపురం రీజియన్ పరిధిలోని 13 డిపోల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు తమ ప్రయాణాలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకున్నారు. ఆర్టీసీ దాదాపు రూ.20 లక్షల మేర ఆదాయం కోల్పోయినట్లు సమాచారం.