బినామీలపై బిగుస్తున్న ఉచ్చు! | HC seeks status report on AgriGold scam | Sakshi
Sakshi News home page

బినామీలపై బిగుస్తున్న ఉచ్చు!

Published Tue, Mar 1 2016 2:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

బినామీలపై బిగుస్తున్న ఉచ్చు! - Sakshi

బినామీలపై బిగుస్తున్న ఉచ్చు!

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా కనిపించడం లేదు. దీంతో బాధితులే అగ్రిగోల్డ్ బినామీదారుల వివరాలతో సీఐడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. విశాఖ కేంద్రంగా అగ్రిగోల్డ్ సంస్థలో భాగస్వామ్యులైన వారికి సంస్థలోకి రాక ముందున్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల వ్యత్యాసాన్ని గుర్తు చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
 
* అగ్రిగోల్డ్ బినామీలపై ఫిర్యాదు
* అజ్ఞాతంలోకి డెరైక్టర్లు, వీసీలు
* సీఐడీ కార్యాలయంలో బాధితులు
* రెండు నెలల్లో అకౌంట్లు ఖాళీ
* జిల్లాలో నుంచి రూ.వెయ్యి కోట్లు


 శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం జిల్లాతోపాటు పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని రాయఘడ, గజపతి, గంజాం జిల్లాల్లోను, ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లి అండమాన్‌లో స్థిరపడ్డ వారి నుంచి సుమారు రూ.1000 కోట్లు పైగా నాన్ బ్యాంకింగ్,  నాన్ ఫైనాన్సియల్ వ్యాపారాలు నిర్వహించిన అగ్రిగోల్డ్ సంస్థ ఉత్తరాంధ్రలో భారీగానే ఆస్తులను కూడబెట్టింది. ఈ ఆస్తులకు కస్టోడియన్లుగా ఉన్న వారంతా బినామీలుగా వ్యవహరించి రూ.కోట్లకు పడగలెత్తారు. వారి మాటలు నమ్మిన జనం రూ.కోట్లలో నష్టపోయారు.

దీంతో రూ.వందల కోట్లు పెట్టుబడులుగా చూపించిన సంస్థ రియల్ ఎస్టేట్, అగ్రిఫాం,  హాయ్‌లాండ్‌ల ఏర్పాటు వంటి వ్యాపారాలు సాగించింది. విశాఖ కేంద్రంగా అగ్రిగోల్డ్ సంస్థలో భాగస్వామ్యులైన వారికి సంస్థలోకి రాక ముందున్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల వ్యత్యాసాన్ని గుర్తు చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదులు పంపించడానికి బాధితులు సిద్ధమవుతున్నారు.
 ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రేతర వ్యాపారాలకు బాధ్యులుగా వ్యవహరించిన మాగంటి భానోజీరావు ప్రస్తుతం సంస్థలో వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

అగ్రిగోల్డ్ సంస్థ నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కీలక భూమిక పోషిస్తున్న డొప్పా రామ్మోహనరావు,  శ్రీకాకుళం జిల్లా నుంచి కీలకంగా సంస్థలో ఎదిగి ఆడిటింగ్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కొండల ఈశ్వరరావు, దక్షిణ కేదారి ప్రాజెక్టు డెరైక్టరుగా వ్యహరిస్తున్న మంగాదేవి ప్రసాద్, అరకువ్యాలీ, సిద్ధ ప్రాజెక్టు పర్యవేక్షకులుగా ఉన్న పి.పి.నాయుడు, ఎస్.ఆర్.ఇ. పాత్రుడు,  వివాహ బంధం డెరైక్టరుగా ఉన్న ఎల్.వి.ప్రసాద్,  ఇతర డెరైక్టర్లు కె.వి.వి. పరశురాం,  టి.డి.ప్రసాద్,  ఎం. ఉమామహేశ్వరరావు,  ఎస్. కోటేశ్వరరావు,  కె.వి.సతీష్‌లపై బాధితులు ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా నుంచి సీఐడీ కార్యాలయానికి వెళ్లిన బాధితులు , ఏజెంట్లు సంస్థలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు ముఖం చాటేస్తున్ననారంటూ ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరంతా చైర్మన్, వైస్ చైర్మన్‌లకు వీరు సన్నిహితులుగా వ్యహరించి బినామీలుగా వ్యవహరించారంటూ ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.  
 
ప్రైవేటు బ్యాంకుల నుంచి సొమ్ము ఖాళీ
జిల్లాలో అగ్రిగోల్డ్ సంస్థ రూ.1000కోట్ల మేరకు స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులుగా వసూలు చేసింది. సేకరించిన మొత్తాలను ఎప్పటికప్పుడు సంస్థలో దాచిపెట్టకుండా ప్రైవేటు బ్యాంకుల్లో బినామీలే దాచిపెట్టారు. అగ్రిగోల్డ్ కార్యాలయాల్లో ఎక్కడా సేఫ్ లాకర్లు లేక పోవడంతో ఇతర ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉంచారు.

ప్రైవేటు బ్యాంకు ఖాతాలనుంచి లావాదేవీలు నిర్వహిస్తూ నిధులు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. అయితే సంస్థ మూసిన నాటికి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిల్వలను గత రెండు నెలల్లో సంస్థకు చెందిన బినామీలేదారి మళ్లించారని బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐడీ కేసులు నమోదైన తర్వాత  కూడా సదరు డెరైక్టర్లు లావాదేవీలు జరిపారంటూ బాధితులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు.
 
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎకో అరకువ్యాలీతోపాటు ప్రాచ్యూన్ ప్రాజెక్టుల పేరుతో వ్యాపారాలు సాగించిన అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాం. నాతోపాటే బంధువులతో ఇందులో పెట్టుబడులు పెట్టించా. ఇప్పడు నెలల తరబడి ఆ సొమ్ము కోసం తిరుగుతున్నాం. ఎప్పటికి ఈ సమస్య పరిష్కారం అవుతుందో గానీ అప్పుల పాలయ్యాం. ప్రభుత్వ పెద్దలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అధికార పార్టీకి సన్నిహితుడైన శ్రీనివాస్ ఇందులో డెరైక్టరుగా వ్యవహరిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నంలో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.
- పైడి గోవిందరావు, బాధితుడు
 
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎకో అరకు వ్యాలీ పేరుతో 400ఎకరాల భూమిని చూపించి వ్యాపారం సాగించిన కంపెనీ ప్రతినిధులు భానోజీరావు, ఆయన సోదరుడు ఉమామహేశ్వరరావు,  వంటి వారంతా ఇప్పుడు బాధితులకు ముఖం చాటేస్తున్నారు. తప్పనిపరిస్థితిలో సీఐడీ అధికారులను కలవాలని నిర్ణయించాం. ప్రభుత్వానికి ఈ కేసులో బాధితులకు న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధిలేదు. అందువల్లే న్యాయం కోసం అందరి సహకారం కోరుతున్నాం.
 -జయసింహ,  అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement