
పెళ్లాడతానని.. మోసం చేశాడు
కడప రూరల్ : ‘ప్రేమించాడు.. పెళ్లాడతానన్నాడు.. పెళ్లి పత్రికలు కొట్టించాం.. బంధువులందరికీ పంపిణీ చేశాం.. ఇక రెండు రోజుల్లో వివాహమనగా పారిపోయాడు... అతనితోనే నా వివాహం జరిపించాలి’ అని స్థానిక ఆర్‌కే నగర్‌కు చెందిన వెంకట మహాలక్ష్మి కోరారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన స్నేహితుల ద్వారా రవీంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో ఐదేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందన్నారు. తనను వివాహం చేసుకోవాలని కోరాడని పేర్కొన్నారు. ఆ మేరకు ముందు జాగ్రత్త చర్యగా స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్‌కు వచ్చిన ఆ వ్యక్తి వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. వివాహ పత్రికలు ముద్రించి బంధువులకు పంపిణీ చేశామన్నారు. ఈ నెల 23న దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల్లోపు తమ వివాహం జరగాల్సి ఉందన్నారు. అంతకుముందు 21న పెళ్లి దుస్తులు తీసుకున్న తర్వాత అతను సాయంత్రం వేళ కడప మున్సిపల్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి దాడి చేయడంతోపాటు తన సెల్ తీసుకుని పారిపోయాడని ఆరోపించారు. ఈ విషయంపై అప్పుడే స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతని అభిప్రాయం మేరకే పెళ్లి పత్రికలు ముద్రించి, పంపిణీ చేశామని పేర్కొన్నారు. అతను పారిపోవడంతో తనకు తమ బంధువర్గంలో ఇబ్బందికరంగా ఉందన్నారు. ఆ వ్యక్తితోనే వివాహం జరిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో బాధితురాలి తల్లి కృష్ణవేణి, స్థానికులు పద్మజ, మణెమ్మ, జయశీల, సుశీల తదితరులు పాల్గొన్నారు.