విధులకు డుమ్మాకొట్టిన హెచ్ఎం
♦ యువతితో పాఠశాల నిర్వహణ
♦ పొట్టి నాగన్నదొరపాలెంలో ఎస్‌ఐ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు
♦ విద్యాశాఖ అధికారులు పట్టించుకోనందునే ఈ దుస్థితి అని ఆవేదన
♦ చర్యలు తీసుకుంటాం: ఎంఈవో సాయిశైలజ
నాతవరం : మారుమూల గిరిజన గ్రామంలో పాఠశాలకు వెళ్లకుండా విధులకు డుమ్మా కొడుతున్న హెచ్‌ఎం ఉదంతం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పొట్టి నాగన్నదొరపాలెంలో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరిని జాలారిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై విద్యాశాఖ అధికారులు నియమించారు. మిగిలిన హెచ్‌ఎం రమణ మాత్రం వారం రోజుల్లో రెండు మూడు రోజులు మాత్రమే పాఠశాలకు వస్తున్నారని మిగతా రోజుల్లో ఓ యువతితో నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఎక్సైజ్ సీఐ రాజు, నాతవరం ఎస్‌ఐ అశోక్‌కుమార్ నిర్వహించిన సారా నిర్మూలన అవగాహన సదస్సులో గ్రామస్తులు ఉపాధ్యాయుల పనితీరుని వారి దృష్టికి తీసుకువచ్చారు.
సభ అనంతరం ఎస్‌ఐ, విలేకరులను గ్రామస్తులు పాఠశాలకు తీసుకువెళ్లి చూపించారు. ఆ సమయంలో హెచ్‌ఎం లేరు. ఓ యువతి, 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీనిపై ఎస్‌ఐ ఆరా తీయగా హెచ్‌ఎం సక్రమంగా పాఠశాలకు రావడం లేదని గ్రామస్తులు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుకావడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులను బయట ప్రాంతాలకు పంపించడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయనందున ఉపాధ్యాయుల పనితీరు ఇష్టారాజ్యంగా ఉందని గ్రామస్తులు ధ్వజమెత్తారు. దీనిపై ఎంఈవో సాయిశైలజను వివరణ కోరగా హెచ్‌ఎం రమణ సెలవు పెట్టలేదన్నారు. దీనిపై పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.