రంగుల పండ్లు, కూరగాయలతో ఆరోగ్యం
పోషక విలువలతో జబ్బుల నివారణ
గుమ్మలక్ష్మీపురం: నవనవలాడే నీలం వంకాయలు. పచ్చని ఆకుకూరలు. ఎర్రని టమాటాలు. పసుపుపచ్చని మామిడి పండ్లు. ఊదారంగు నేరేడు. తెల్లని వెల్లుల్లి. అన్నీ వర్ణశోభితం.. ఆరోగ్యదాయకం. అత్యంత ఆహ్లాదభరితం. కనువిందు చేస్తుంది.. కమ్మని ఆరోగ్యం పంచుతుంది. అది మనచేతుల్లోనే ఉంది. అన్ని రంగుల పండ్లు, కూరలు తినండి.. పచ్చగా నూరేళ్లు బతకండి.. అంటున్నారు రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త సునీత. చాలామంది పండ్లు, కూరగాయలు తింటారు. కానీ విభిన్న రంగుల్లో దొరికే వాటిని తినేవారు స్వల్పం. ఒక్కొక్క రంగులో లభించే పండు లేదా కూరగాయలకు ప్రత్యేకత ఉంటుంది. వాటిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజ లవణాలుంటాయి. పండ్లు, కూరగాయల్లో ఉండే పిగ్మెంట్స్ రంగుకు కారణమవుతాయి. ఆకుపచ్చరంగులో క్లోరోఫిల్, నారింజ రంగులో కెరోటినాయిడ్స్, నీలం రంగులో జాంధోఫిల్ ఉంటాయి. వీటి వల్ల కూడా చాలా లాభాలున్నాయి. ప్రమాదానికి గురైనప్పుడు శరీరంలో డీఎన్‌ఏ క్షీణించకుండా కెరోటినాయిడ్స్ కాపాడతాయి. సల్పోరాఫిన్ ఐసోసయనేట్, ఇండోల్ అనే రసాయనాలను ఉత్పత్తి చేసి క్యాన్సర్‌ను అరికడతాయి. పీచు పదార్ధాలు అధికంగా ఉండటం వల్ల మలబద్దకం, మధుమేహం, గుండెజబ్బులను రాకుండా చేస్తాయి. కాల్షియం ఎముక పుష్టినిస్తే.. ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
ఆకు కూరలు
తోటకూర, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా, గోంగూర, మునగాకు
కాయగూరలు
వంకాయ, బెండకాయ, దొండకాయ, కాకర కాయ, క్యాబేజి పువ్వు, అరటి కాయ, మునగకాయ, దోసకాయ, ఆనపకాయ, బీరకాయ, బూడిద గుమ్మడి, గుమ్మడికాయ, పొట్లకాయ, చిక్కుడు కాయలు
దుంపలు
బంగాళ దుంపలు, క్యారెట్, బీట్‌రూట్, రాడిష్, చిలకడ దుంప, కంద, చామదుంపలు, ఉల్లి
ఆకుపచ్చ రంగు ప్రయోజనాలు
వీటిలో క్లోరోఫిల్ ఉంటుంది. పీచు పదార్ధం, జయుగ్జాంధీన్, రిన్వేరట్రాల్, విటమిన్ సి, ఎ ఫ్లావనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. వీటితో కంటి చూపు, రెటీనా ఆరోగ్యంగా ఉంటుంది. శరీర అంతర్గత అవయవాల పొరలను కాపాడేందుకు, హెమోగ్లోబిన్ వృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంచేందుకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి.
ఇవి తినాలి:
తోటకూర, పాలకూర, క్యాబేజ్, మునగ, బీర, కాకర, దొండ, బెండ, గ్రీన్ ఆపిల్.
పసుపు, నారింజ రంగు ప్రయోజనాలు
వీటిలో ప్రధానంగా బీటాకెరోటిన్, జియాగ్జాంధీన్, ప్లేవనాయిడ్స్, లైవోఫిన్, పొటాషియం, విటమిన్ సి తదితర పోషకాలుంటాయి. వృద్ధాప్య సమస్యలను నివారిస్తాయి. కంటి, నాడి సంబంధిత సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటాయి. కణజాల క్షీణతను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి ఫ్రితాడికల్స్‌ను తగ్గిస్తాయి. కణజాలం మధ్య ఉండే జిగట పదాఽర్థం అభివృద్ధికి దోహదపడతాయి. ఎముకలు, కీళ్ల దగ్గర ఉండే మృదులాస్తి కణజాల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి.
ఇవి తినాలి
నారింజ, నిమ్మ, బొప్పాయి, క్యారెట్, మామిడి, గుమ్మడి, స్వీట్ కార్న్.
ఎరుపు రంగు ప్రయోజనాలు
వీటిలో లైకోఫిన్, పిగ్మెంట్ ఎల్లాజిల్, ఆసిడ్, క్విర్సిటిన్, హెసృరిడిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను తగ్గించమే కాక కణుతుల పెరుగుదలను నిరోధిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రిరాడికల్స్ వంటి వ్యర్థాలు, మలినాలను బయటికి పంపిస్తాయి.
ఇవి తినాలి
టమాటా, చెర్రి, ఎర్రజామ, దానిమ్మ, ఎర్ర అరటి.
తెలుపు రంగు ప్రయోజనాలు
వీటిలో లిగ్నాన్స్, బీటాగ్లూకున్స్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, హాని చేసే అంశాలపై పోరాడే బిసెల్స్, టీసెల్స్‌ను ఉత్తేజపరుస్తాయి. ప్రోస్టెట్ క్యాన్సర్‌ను తగ్గిస్తాయి. హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి అల్లిసిన్ అనే పదార్థం ట్యూమర్స్, శ్వాసకోస వ్యాధులను నివారిస్తాయి.
ఇవి తినాలి
ఉల్లి, వెల్లుల్లి, కాలిఫ్లవర్, క్యాబేజీ, రాడిష్, పుట్టగొడుగులు, అరటి.
నీలం, ఊదా రంగు ప్రయోజనాలు
ఈ రంగు పండ్లు, కూరగాఽయలు సహజంగా వగరు రుచిలో ఉంటాయి. వీటిలో ల్యూటిన్, జియాగ్జాంధీన్, రెన్విరెట్రాల్, ప్లెవనాయిడ్స్, ఎల్లాజిల్‌మాసిడ్, క్వేర్సటిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ రంగు పండ్లు, కూరగాయలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో చెడు కొవ్వును, ఫ్రిరాడికల్స్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణక్రియను క్రమబద్ధీకరించి కాల్షియం, ఐరన్ పెరిగేందుకు ఉపకరిస్తాయి. రక్తనాళాల్లో కణుతులు ఏర్పడకుండా నిరోధిస్తాయి. రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి.
ఇవి తినాలి
ద్రాక్ష, నేరేడు, బ్లూబెర్రీస్, వంగ, బీట్‌రూట్.
కూరగాయల్లో ఉండే పోషక విలువలు
పేరు మాంసకృత్తులు, కొవ్వు పీచు కాల్షియం ఐరన్ విటమిన్ సి
బూడిదగుమ్మడి 0.4 0.1 0.8 30 0.8 1
బీరకాయ 0.5 0.1 0.5 18 0.39 5
దోసకాయ 0.4 0.1 0.4 10 0.60 7
ఆనపకాయ 0.2 0.1 0.6 20 0.46 0
గుమ్మడి కాయ 0.4 0.1 0.6 10 0.44 2
పొట్లకాయ 0.5 0.3 0.8 26 1.5 5
చిక్కుడు 4.5 0.1 2.0 50 1.4 12
మునగ కాయ 2.5 0.1 4.8 30 0.18 120
అరటి కాయ 1.4 0.2 0.7 10 6.27 24
క్యాబేజి పువ్వు 2.6 0.4 1.2 33 1.23 56
వంకాయ 1.4 0.3 1.3 18 0.38 12
బెండ 1.9 0.2 1.2 66 0.35 13
దొండ 1.2 0.1 1.6 40 0.38 15
కాకర 2.1 1.0 1.7 23 2.0 96
ఉల్లికాడలు 0.9 0.2 1.6 50 7.43 17
బీట్‌రూట్ 1.7 0.1 0.9 18.3 1.19 10
క్యారెట్ 0.9 0.2 1.2 80 1.03 3
చామ 3.0 0.1 1.0 40 0.42 0
బంగాళదుంప 1.6 0.1 0.4 10 0.48 17
ఆకుకూరల్లో ఉండే పోషక విలువలు
పేరు మాంసం కొవ్వు పీచు కాల్షియం ఐరన్ విటమిన్ ఎ సి
తోట కూర 4.0 0.5 1.0 397 3.49 5400 169
చుక్కకూర 1.6 0.3 0.6 63 0.75 3660 124
క్యాబేజి 1.8 0.1 1.0 39 0.8 120 124
కాలీఫ్లవర్ 2.6 0.4 1.2 33 1.23 30 56
పాలకూర 2.0 0.7 0.6 73 1.14 5580 28
గోంగూర 1.7 1.1 1.3 130 1.7 2898 20
కొత్తిమీర 3.3 0.6 1.2 184 1.42 6918 135
పుదీన 4.8 0.6 2.0 200 15.6 1620 27
మెంతి 44 0.9 1.1 395 1.93 2340 52
మునగాకు 6.7 1.7 0.9 440 0.85 6780 220