
తనివితీరా.. వాన!
వరుణుడు మళ్లీ విజృంభించాడు. జిల్లాలోని 63 మండలాల్లో గురువారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం
- పిడుగుపాటు, గోడకూలి 21 మేకలు మృతి
- నీట మునిగిన ఉల్లి
- పొంగుతున్న వాగులు.. వంకు.. చెక్‌డ్యాంలు
అనంతపురం అగ్రికల్చర్: వరుణుడు మళ్లీ విజృంభించాడు. జిల్లాలోని 63 మండలాల్లో గురువారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్క రోజులోనే 22.6 మిల్లీమీటర్లతో ఈ సీజన్‌లోనే రెండవ అత్యధిక సగటు వర్షపాతం నమోదు కావడం విశేషం. ఈనెల 5న ఒకే రోజు 25.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మొత్తం మీద గత ఐదారు రోజులుగా వరుణుడు విరామం ఇవ్వడంతో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేని వర్షం కురిసింది. భారీ ఉరుములు, మెరుపులకు గాలి కూడా తోడు కావడంతో మంచి వర్షాలు కురిశాయి. ప్రధానంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ డివిజన్ల పరిధిలో భారీ వర్షాలు నమోదయ్యాయి.
శెట్టూరు మండలంలో 91.3 మి.మీ భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెక్‌డ్యాంలు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. డి.హిరేహాల్ మండలంలో ఉల్లి పంట దెబ్బతినగా, పిడుగు పడి గుమ్మగట్ట మండలం నేత్రపల్లిలో హనుమంతుకు చెందిన 6 మేకలు చనిపోగా, అదే మండలం కలుగోడు గ్రామంలో గోడకూలి గోవిందుకు చెందిన 15 మేకలు చనిపోయాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటికే 105.9 మిల్లీమీటర్లు నమోదు కావడం విశేషం. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 268.8 మిల్లీమీటర్లకు గాను 9 శాతం అధికంగా 298.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
శుక్రవారం అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు(మిల్లీమీటర్లలో)
శెట్టూరు 91.3
విడపనకల్ 76.2
కనేకల్లు 62.4
గుంతకల్లు 57.2
రాయదుర్గం 56.9
గుమ్మగట్ట 53.8
ఆత్మకూరు 53.7
బ్రహ్మసముద్రం 52.2
బొమ్మనహాల్ 43.6
యాడికి 42.7