గాలివాన భీభత్సం
♦ పిడుగుపాటుకు తనికెళ్లలో గొర్రెలకాపరి, అనంతారంలో రైతు,
♦ సిద్ధినేనిగూడెంలో కౌలురైతు మృతి
♦ ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలి వైరా హైవేపై స్తంభించిన ట్రాఫిక్
♦ గాలిదుమారంతో పలుచోట్ల లేచిన ఇంటి పైకప్పు రేకులు
గాలిదుమారం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం జిల్లాలో పలుచోట్ల బీభత్సాన్నే సృష్టించింది. విపరీతమైన గాలులతో ఇళ్ల పైకప్పు రేకులు లేస్తుండడంతో జనం భయాందోళన చెందారు. పిడుగుపాటుకు కొణిజర్ల మండలం తనికెళ్లలో చేల్ల వద్ద మేకలు మేపుతున్న గొర్రెలకాపరి తుప్పతి నాగరాజు(29) చనిపోయాడు. అనంతారంలో పత్తి సాగు చేసేందుకు దుక్కి దున్నుతున్న రైతు ఆలస్యం లక్ష్మయ్య (50) , విత్తనాలు వేసేందుకు సిద్ధమైన సిద్ధినేనిగూడేనికి చెందిన కృష్ణారెడ్డి (40)బలయ్యారు. ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై వీవీపాలెం సమీపంలో ఆర్టీసీ బస్సుపై మర్రిచెట్టు కూలింది. ఈ ప్రమాదంలో బస్సులోని 74మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినా, రెండు గంటల పాటు.. ఆ మార్గంలో రాకపోకలన్నీ నిలిచాయి.
భారీ గాలుల ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వి.వెంకటాయపాలెం-తనికెళ్ల మధ్య ప్రధాన రోడ్డుపై మధిర డిపో ఆర్టీసీ బస్సుపై మర్రిచెట్టు కూలి పడింది. బస్సు పాక్షికంగా దెబ్బతింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే..విరిగిపడిన మర్రిచెట్టు పూర్తిగా రోడ్డుపైనే ఉండడం, బస్సు మధ్యలో ఇరుక్కుపోవడంతో..రహదారి మొత్తం బ్లాక్ అయింది. దీంతో..ఇటు ఖమ్మం నుంచి వచ్చే వాహనాలు, అటు సత్తుపల్లి, భద్రాచలం, వైరా గుండా హైవే మీద వచ్చే వాహనాలన్నీ ఎక్కడివక్కడ నిలిచాయి.
మొత్తం రెండు కిలోమీటరకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు, లారీలు, ఆటోలు లన్నీ ఆగిపోయాయి. విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు, వివిధ పనుల మీద వచ్చి వెనుతిరిగిన వారు, విద్యాసంస్థల నుంచి బయల్దేరిన విద్యార్థులు అంతా..ట్రాఫిక్ జాంలో చిక్కుకొని అవస్థలు పడ్డారు. ప్రయాణికులు వాహనాలు దిగి..రోడ్డుపై గంటల తరబడి నిరీక్షించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు చాలా అసౌకర్యం చెందారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, స్థానికుల సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.