విస్తారంగా వర్షాలు
- కోసిగిలో అత్యధికంగా 88.6 మి.మీ. వర్షపాతం
- జిల్లా సగటున 38.8 మి.మీ. నమోదు
- ఉల్లికి అపార నష్టం
- గణేష్ నిమజ్జనానికి తొలగిన నీటి అడ్డంకులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు విస్తారంగా కురిశాయి. అత్యధికంగా కోసిగిలో 88.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా కొలిమిగుండ్ల, చిప్పగిరి మండలాల్లో సెం.మీ. ప్రకారం నమోదు కాగా శ్రీశైలం మండలంలో అసలు నమోదు కాలేదు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా 38.8 మి.మీ. నమోదు కావడం విశేషం. ఇటీవలి వరకు ఒక మోస్తరు వర్షాలకే పరిమితమైన రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం తోడుకావడంతో జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా గణేష్ నిమజ్జనానికి నీటి సమస్య తీరినట్లయింది.
ఉల్లి రైతు గగ్గోలు...
కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లో కోత దశలో ఉన్న ఉల్లికి ప్రస్తుత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందల హెక్టార్లలో పంట నీట మునిగింది. వర్షాలు వల్ల ఉల్లి తడుస్తుండటం వల్ల నాణ్యత తగ్గి ధరలు తగ్గిపోతుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొసిగి, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు తదితర మండలాల్లో భారీ వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 163.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.