చేప ఎండేలోగా వానొచ్చేసింది..!
►భారీ వర్షానికి కొట్టుకుపోయిన ఎండుచేపలు
► రూ.20 లక్షల మేర నష్టం
► తీరంలో ఆకలి కేకలు
బాపట్ల: ఎగిసిపడుతున్న కెరటాలకు ఎదురొడ్డి జీవనం సాగించే మత్స్యకారులకు ఈ ఏడాది అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఏ గడియలో ఐల వలల వేటలు సాగించారో కానీ వలలు వేసినప్పటికీ నుంచి వాళ్లను వరుణుడు వెంటాడుతున్నాడు. వలలు రెండు నెలల క్రితం ప్రారంభించినప్పటికీ మొన్నటి దాక చేపలు పడక రేయింబవళ్లు కష్టపడినా కనీసం రోజుకు రూ.100 నుంచి 150 కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవించారు. నెల మొదటి వారంలో వేట కలిసొచ్చినప్పటికీ 15 రోజులుగా కురిసిన వర్షాలకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కురిసిన వర్షం మత్స్యకారుల ఆశలపై నీళ్లుచల్లింది. దీంతో ఎండబెట్టుకున్న చేపలన్నీ తడిచిపోయి కాలువల గుండా కొట్టుకుపోయి సముద్రంలో కలిశాయి.
రూ. 20 లక్షల మేర నష్టం..
15 రోజుల క్రితం వేటాడిన చేపలను సూర్యలంక సమీపంలో ఫారెస్ట్ భూమి (పర్ర)లో ఎండపెట్టుకున్నారు. నేడో రేపో లారీలకు లోడ్ చేస్తే వచ్చిన సొమ్ముతో కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చంటూ ఆశగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల ఆశలను వరుణుడు తుడిచేశాడు. వారంరోజులుగా అనేకసార్లు వర్షాలు కురవడంతో వాగులు, పర్ర మొత్తం మునిగిపోయి చేపలు కాలువ ద్వారా కొట్టుకుపోయాయి.
పూర్తిగా ఎండిపోయిన చేపలు తడిచిన తర్వాత ఎందుకు పనిరాకుండా పోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రూ. 20 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా వర్షంతో పాటు ఆలల ఉధృతికి సముద్రంలో లంగర్ వేసి ఉన్న పడవలు వడ్డుకు కొట్టుకు వచ్చి ఐలవలలు తీరం వెంబడి ఇసుకు పూడుకుపోయి తెగిపోయాయి. వీటిని సరిచేసుకోవడానికి మరో వారంరోజుల సమయం పడుతుందని మత్స్యకారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.