మృత్యుశకటం | Heavy road accident | Sakshi
Sakshi News home page

మృత్యుశకటం

Published Sun, Oct 18 2015 4:31 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మృత్యుశకటం - Sakshi

మృత్యుశకటం

వ్యాన్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
♦ 15 మంది మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
♦ 36 మందికి గాయాలు.. ఆందోళనకరంగా ముగ్గురి పరిస్థితి
♦ {పకాశం జిల్లా చెర్లోపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
♦ పెళ్లి బృందంలో విషాదం..
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాసేపట్లో పెళ్లి వేడుకల్లో బంధువులతో కలసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాల్సిన పెళ్లి బృందాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. మరో అరగంటలో పెళ్లిమండపం వద్దకు చేరుకోవాల్సిన వారు గమ్యం చేరుకోకముందే ప్రాణాలను కోల్పోయారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు నుంచి మాలకొండలోని శ్రీలక్ష్మినరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న వివాహానికి పెళ్లి బృందంతో బయల్దేరిన ఓ  అశోక్‌లేల్యాండ్ వ్యాన్‌ను అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రకాశం జిల్లా వలివేటివారిపాలెం మండలం చెర్లోపల్లి వద్ద శనివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులతోసహా 15 మంది మృత్యువాత పడ్డారు.

13 మంది అక్కడే మరణించగా.. ఇద్దరు ఆసుపత్రికి తరలించిన అనంతరం కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాన్ వెనక భాగాన్ని బస్సు ఢీకొనడంతో అది ఊడిపోయి 20 అడుగుల దూరంలో పడిందంటే.. ప్రమాద తీవ్రత ఎంతనేది అర్థం చేసుకోవచ్చు. ప్రమాద తీవ్రతకు పెళ్లి వ్యాన్‌లో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. కాళ్లు, చేతులు, తలలు తెగి ఎక్కడికక్కడ పడిపోయాయి. ప్రమాద స్థలి భీతిగొలిపేలా మారింది. మృతుల్లో 9 మంది ప్రకాశం జిల్లావాసులు కాగా.. ఆరుగురు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వ్యాన్‌ను ఢీకొన్నాక బస్సు పక్కనే ఉన్న గుంతలో పడి దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 వివాహానికి సందడిగా బయలుదేరి..
 ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరుకు చెందిన సమాధి సుబ్బారావు కుమార్తె సురేఖ వివాహం వలివేటివారిపాలెం మండలం సీతారామపురం కూరేటిపల్లికి చెందిన పిన్నిబోయిన మాల్యాద్రి కుమారుడు మహేం ద్రతో శనివారం ఉదయం ఏడుగంటలకు మాలకొండలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరగాల్సి ఉంది. పెళ్లి కుమార్తెను ముందురోజు రాత్రే కారులో పంపించి.. బంధువులు, ఊరి జనం అశోక్‌లేల్యాండ్ వ్యాన్‌లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరారు. మధ్యలో చెమిడిదెపాడులో మరో ముగ్గురు బంధువులను ఎక్కించుకొని గుడ్లూరు మీదుగా కందుకూరు దాటి రెండు కిలోమీటర్లు వెళ్లారు.

మరో అరగంటలో గమ్యస్థానం చేరుకునేలోగా ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఎదురుగా కృష్ణా ట్రావెల్స్‌కు చెందిన బస్సు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. సింగిల్‌రోడ్డు కావడం, వాహనాన్ని రోడ్డు పక్కకు తీసేలోగానే ఇంజన్ వెనకున్న బాడీని బలంగా ఢీకొట్టడంతో వ్యాన్ నుంచి బాడీ వేరుపడి 20 అడుగుల దూరంలో పడింది. అక్కడికక్కడే 13 మంది చనిపోగా, ఇద్దరు కందుకూరు ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 51 మంది ఉన్నారు.

 భీతి గొలిపిన ప్రమాదస్థలి..
 ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో వస్తుండటంతో వ్యాన్ బాడీ పూర్తిగా తుక్కుతుక్కయింది. బస్సు ఢీ కొట్టిన ప్రాంతంలో కూర్చున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లికూతురు నానమ్మ తల తెగిపడింది. శరీరం కూడా నడుము వరకూ రెండు ముక్కలైంది. ప్రమాద స్థలిలో పరిస్థితి భీతి గొలిపేలా మారింది. తెగిపడిన చేతులు, కాళ్లు... చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలతో భయంకర వాతావరణం నెలకొంది. ఒకవైపు శవాలు.. మరోవైపు తీవ్రంగా గాయపడినవారి రోదనలతో ఆ ప్రాంతమంతా మిన్నంటింది. వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు కూడా పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది.

షార్ట్‌సర్క్యూటవడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. బస్సుడ్రైవర్ బయటపడినా.. అందులోని వంటమాస్టర్‌ను అక్కడి ప్రజలు రక్షించారు. తరువాత కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో బస్సులో ఉన్న మూడు సిలిండర్లలో ఒకటి పేలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఏపీ  మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు.

 చేవూరులో విషాదఛాయలు...
 ప్రమాద విషయం తెలియడంతో చేవూరులో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు పెద్దసంఖ్యలో కందుకూరు తరలివచ్చారు. సమాధివారి ఇంట జరుగుతున్న పెండ్లికని వెళ్లి తమ కుటుంబ సభ్యులు సమాధయ్యారని కన్నీళ్లపర్యంతమయ్యారు. ‘పెళ్లికెళ్లిన మా అమ్మకు ఏమైందని’ సుభాషిణి అనే మహిళ పిల్లలు అమాయకంగా అడగడం అందరినీ కలిచివేసింది. కావలి మండలం చెన్నైపాలేనికి చెందిన సన్నెబోయిన బాలమురళీకి ఉన్న ముగ్గురు పిల్లలు మృత్యువాత పడగా, భార్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన దగ్గరకు వచ్చిన వారందరినీ ‘నా బిడ్డలేరీ’ అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక బంధువులు మౌనంగా రోదిస్తున్నారు. పెళ్లి కూతురు తల్లి కూడా ప్రమాదంలో గాయపడింది. చేవూరుకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు బ్యాంకు ఉద్యోగానికి సెలక్టయ్యాడు. త్వరలో పోస్టింగ్ ఆర్డర్లు వస్తాయనుకున్న తరుణంలో మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది.

 పలువురి పరామర్శ
 మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పలువురు నేతలు, అధికారులు పరామర్శించారు. మంత్రి శిద్దా రాఘవరావు, వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బాలావీరాంజనేయస్వామి పరామర్శించిన వారిలో ఉన్నారు.

 రోడ్డుప్రమాద మృతులు వీరే....
 ప్రకాశం జిల్లా వాసులు: నక్కల సుభాషిణి(35), తోడేటి ప్రసాద్(23), తోడేటి చిరంజీవి(45), రాయిని సుబ్బయ్య(50), ఏలగాల సుబ్బయ్య(75), సమాధి నాగమ్మ(65) , మెటుపల్లి పద్మ(45), శింగమనేని వెంకటేశ్వర్లు(47), కొల్లి సుశీల(47).
 నెల్లూరు జిల్లా వాసులు: సన్నెబోయిన రాజమ్మ, బూపాటి హజరత్తయ్య(29), సమాధి రంగయ్య(25), సన్నెబోయిన చందు(10), సన్నెబోయిన శ్రీలేఖ(12), సన్నెబోయిన ఆదినారాయణ(7).
 
 జగన్ దిగ్భ్రాంతి
  సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి వినతి
 సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా చెర్లోపల్లి వద్ద జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణించడం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాద స్థలిని సందర్శించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన పార్టీ నేతలు ఒంగోలు ఎంపి వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డిని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement