హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు వాహనాలు బారులు దీరాయి. హైవేపై రోజుకు సరాసరి 16వేల వాహనాలు ప్రయాణిస్తుండగా, శనివారం మరో 4వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ చెల్లించేందుకు 9గేట్లను, హైదరాబాద్ వైపు 7గేట్లను తెరిచారు. ఆదివారం హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
టోల్ ఫీజు మినహాయింపనే ప్రచారంతో..
పుష్కరాలకు వెళ్లే వాహనాలకు టోల్ ఫీజును మినహాయిస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు టోల్ చెల్లించేందుకు నిరాకరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని టోల్ చెల్లించాలని టోల్‌ప్లాజా సిబ్బందిచెప్పడంతో పలువురు వాగ్వాదానికి దిగారు. టోల్ ఫీజును వసూలు చేయొద్దని ఎలాంటి ఆదేశాలు లేవని జీఎంఆర్ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.