నరకం ... నరకం
పెద్దశంకరంపేట:గ్రామాల్లోని మట్టి రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా సిమెంటు రోడ్లకు నోచుకోవడం లేదు. చిన్నపాటి వర్షాలకే బురదమయంగా మారి నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని మాధవ నగర్‌కు వెళ్లే దారే ఇందుకు నిదర్శనం. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వర్షాలు పడితే నడక కూడా కష్టమే. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలవడం, వాహనాల రాకపోకల వల్ల దారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో రోడ్డు పక్క ఉన్న పొలాల్లో నడవాల్సి వస్తోంది. వర్షం పడిన పది పదిహేను రోజులు తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని పాదచారులు తెలిపారు. ఈ సమస్య పంచాయతీ సిబ్బంది, అధికారులకు తెలిసినా వారు రోడ్డు బాగు కోసం కృషి చేయడం లేదని ఆరోపించారు. గతంలో సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను కోరినట్లు ప్రజలు తెలిపారు.]
ప్రతి రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది ఈ మార్గంలో కాలి నడకన రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కూడా బురద కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని వివరించారు. అంతేకాకుండా బురదలో వాహనం ఇరుక్కుపోతే దాన్ని బయటికి తీయడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి రోడ్డును సీసీగా మార్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.