
'పవర్‌ఫుల్ పోలీస్‌గా నటించాలనుంది'
సినీ నటి హేమ
రాజమండ్రి : పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని ఉందని ప్రముఖ సినీ నటి హేమ అన్నారు. వీరలంకపల్లి శివారున ఉన్న శ్రీరామ్‌సాయి గోకులాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్‌లుగా మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో, క్రిష్ రూపొందిస్తున్న బాలకృష్ణ 100వ సినిమాలో, కామెడీ యాక్టర్ సప్తగిరి హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో విలన్ షేడ్ ఉన్న పాత్రలో, రాజ్‌తరుణ్ సినిమాలో అతనికి తల్లిగా నటిస్తున్నానన్నారు.
ఇప్పటి వరకు సుమారు 450 సినిమాల్లో నటించిన తనకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, అతడు, పెళ్లైన కొత్తలో, అష్టాచమ్మా, క్షణక్షణం’ పేరు తీసుకువచ్చాయన్నారు. భవిష్యత్తులో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో స్టూడియో ఏర్పాటు చేయాలని ఉందన్నారు. తన భర్త జాన్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారని, కుందనపు బొమ్మ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశారన్నారు.
కుమార్తె ఇష పదవ తరగతి చదువుతోందన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అభిప్రాయం లేదని, ప్రజలకు మంచి చేసే పార్టీ తరఫున పని చేస్తానన్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలన్నారు. అనంతరం గోకులంలో ఉన్న గోవులకు ఆమె స్వయంగా ఆహారపదార్థాలు తినిపించారు. ఆమె వెంట గోకులం నిర్వాహకులు పలివెల వీరరాఘవులు, రమాదేవి దంపతులు, సినీ హీరో గంగాధర్ ఉన్నారు.