వైద్యరంగంలో ఆత్మహత్యలెక్కువే..!
-
ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు వైద్యరంగంలో ఎక్కువే
-
వైద్య కళాశాలలో స్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి
-
అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ గార్లపాటి వంశీ
గుంటూరు మెడికల్ : ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో వైద్యరంగానికి చెందిన వారు ఎక్కువగానే ఉన్నారని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ గార్లపాటి వంశీ చెప్పారు. గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో సోమవారం ‘‘సెల్ఫ్ డైరెక్టెడ్ వయలెన్స్ ఇన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్’’ అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో డాక్టర్ వంశీ మాట్లాడుతూ గుంటూరులో వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పత్రికల్లో చదివి కనీసం ఒక్క జీవితాన్నైనా కౌన్సెలింగ్ చేసి కాపాడాలనే ఉద్దేశంతో గుంటూరు వచ్చినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్న వారు అందరూ ఆత్మహత్యకు పాల్పడరని, ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసిన అందరూ ప్రాణాలు కోల్పోరన్నారు. ప్రవర్తనలో మార్పుల వల్ల తమను తాము గాయపరుచుకుంటారని, వీరు ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎక్కువ ఒత్తిడికి గురవుతారన్నారు. వాలంటీర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, మెడికోలు,, ఫిజీషియన్లు, సైకాలజిస్టులు, అందరూ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, కౌన్సెలింగ్ తీసుకునేందుకు సుముఖంగా ఉండరన్నారు. వైద్య విద్యలో చేరిన తొలి మూడునెలల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, ఎక్కువగా ఉంటాయని, భారత దేశంలో ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు మొదటి సంవత్సరం ప్రారంభంలో 8 శాతం, ఏడాది చివరలో 22 శాతం ఈ ఆలోచన కలిగి ఉన్నారన్నారు. వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగి ఉన్నారనే విషయాన్ని బయటకు చెప్పరని, కళాశాల పరువు పోతుందని యాజమాన్యాలు ఈ విషయాన్ని దాస్తాయని చెప్పారు. ప్రతి ఏడాది 300 నుంచి 400 మంది ఫిజీషియన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మన దేశంలో 2010 నుంచి 2014 మధ్య 16 మంది వైద్య విద్యార్థులు చనిపోగా, వీరిలో తొమ్మిదిమంది వృత్తిపరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు.
ఈ లక్షణాలు గమనిస్తే...
మనుషుల్లో కలిసేందుకు ఆసక్తి చూపకపోవడం, మాట్లాడకుండా మౌనంగా ఎక్కువ కాలం ఉండి పోవడం, వైద్యం కోసం వచ్చిన రోగులను విసుక్కోవడం, కోపగించుకోవడం, వృత్తి పట్ల ఆసక్తి లేకపోవడం, సరిగా నిద్రపోకపోవడం, కొద్దిపాటి విషయాలకే చికాకు పడడం, తదితర లక్షణాలు గమనిస్తే వీరు ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగి ఉన్నట్టు గుర్తించాలని చెప్పారు. ఒత్తిడి నివారణ మార్గాలను అన్వేషించాలని, సన్నిహితులతో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతోందన్నారు. ప్రతి వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు చేరిన మొదటి ఏడాది రెండు దఫాలుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వైద్య రంగ నిపుణులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించవచ్చన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పెద్ద కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాలు అవడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పేందుకు పెద్దలు తోడు లేకపోవడం వల్ల చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పిల్లలు ఏది అవ్వాలనుకుంటున్నారో తల్లిదండ్రులే నిర్ణయించి బలవంతంగా వారిపై తమ అభిప్రాయాలు రుద్దడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. సదస్సులో గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మార్కండేయులు, పలు వైద్య విభాగాధిపతులు, పలువురు వైద్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.