హైవే దుకాణాలకు ఊరట
Published Wed, Aug 3 2016 10:47 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
మంత్రిని కలిసిన బాధితులు
దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతి
నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి సర్వీసు రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల యజమానులకు ఊరట కలిగింది. ఇటీవల ఈ సెంటర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతుపడిన నేపథ్యంలో నేషనల్ హైవే అధారిటీ అధికారులు, రవాణాశాఖ, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి రోడ్డు వెంబడి సర్వీసు రోడ్డులో దుకాణాలు ఉన్నందునే ప్రమాదాలు జరుగుతున్నాయని, దుకాణాలు తొలగించాల్సిందేనని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ కె.చంద్రశేఖర్ మంగళవారం ఆ ప్రదేశానికి వెళ్లి దుకాణాలను తొలగించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. దీంతో దిక్కుతోచని దుకాణదారులు 25 మంది బుధవారం వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా రోడ్డు వెంబడి దుకాణాలు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నామని, ఇప్పటికిప్పుడు దుకాణాలు తొలగిస్తే తమ గతేం కావాలని వాపోయారు. దీంతో మంత్రి రూరల్ సీఐ శోభన్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా, దుకాణదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దుకాణదారులు సీఐ శోభన్‌బాబును కలవగా, తాను మార్కింగ్ చేసిన ప్రదేశంలో మాత్రమే దుకాణాలు నడుపుకోవాలని, గురువారం ప్రదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు. దుకాణాల ముందు వైపున్న పందిళ్లు, రేకులను తొలగించాలని ఆదేశించారు.
Advertisement
Advertisement