హోంగార్డుల సేవలు అమోఘం
పోలీస్‌శాఖలో హోంగార్డుల సేవలు అమోఘమైనవని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు.
వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం బాధాకరం
– హోంగార్డ్స్ 54వ వ్యవస్థాపక దినోత్సవంలో ఎస్పీ
కర్నూలు : పోలీస్‌శాఖలో హోంగార్డుల సేవలు అమోఘమైనవని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. హోంగార్డుల 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్పీ అతిథిగా హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం చాలా బాధాకరమని చెప్పారు. పోలీసు శాఖలో చేరినప్పటినుంచి హోంగార్డు కుటుంబాలను చాలా దగ్గరగా చూశానని, చాలా మంది ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. తక్కువ జీతాలకు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశమున్న ప్రతిచోటా హోంగార్డు సమస్యలను పైఅధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను బాగా చదివించుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించుకునేలా చూడాలన్నారు. బందోబస్తులకు వెళ్లిన సమయంలో టీఏ, డీఏ అలవెన్సుల సమస్యల గురించి హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ చంద్రమౌళి ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హోంగార్డు శామ్యూల్ రక్షక దళమా... గృహ రక్షక దళమా... అనే పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. చివరగా హోంగార్డులందరూ కలసి ఎస్పీకి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు బాబుప్రసాద్, కృష్ణమోహన్, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐ రంగనాథ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఉమామహేశ్వరరావు, హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయరత్నం, కోశాధికారి మహమ్మద్ రఫి, సభ్యులు రాజేష్, రఘు, సురేష్, బాలకృష్ణ, రామయ్య, మునుస్వామి, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.