హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్
లావేరు : హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ మధుపై బాధితులు గుర్రుమన్నారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, మధును కఠినంగా శిక్షించాలని లింగాలవలస, పోతయ్యవలస గ్రామాలకు చెందిన బాధితులతో పలువురు ప్రజాప్రతినిధులు మంగళవారం డిమాండ్ చేశారు.
ఈ మేరకు వారంతా లావేరు ఎస్‌ఐ సీహెచ్ రామారావునుమ పోలీస్‌స్టేషన్‌లో కలిశారు. మధుకు బాధితులిచ్చిన డబ్బుకు సంబంధించిన వీడియోలను ప్రజాప్రతినిధులు, బాధిత నిరుద్యోగులు ఎస్‌ఐకు చూపించి ఆధారాల కోసం క్లిప్పింగ్‌లను ఎస్‌ఐకు అందజేశారు. నిరుద్యోగులను మోసం చేసిన మధును విడిచిపెట్టొదని డిమాండ్ చేశారు. ఎస్‌ఐను కలిసిన వారిలో లావేరు పీఏసీఎస్ అధ్యక్షుడు మీసాల అప్పారావు, సర్పంచ్‌లు వాళ్లె దాలినాయుడు, ఏఎంసీ మాజీ డెరైక్టర్ లుకలాపు అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
రాచమర్యాదలు...
ఇదిలా ఉండగా నిరుద్యోగులను మోసం చేసిన మధును స్టేషన్ సెల్‌లో పెట్టకుండా పోలీసుల విశ్రాంతి గదిలో ఉంచి మర్యాదలు చేయడమేమిటని ఏఎంసీ మాజీ డెరైక్టర్ లుకలాపు అప్పలనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు మీసాల అప్పారావు పోలీసులను ప్రశ్నించారు. మధును ఉద్యోగం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించేలా కేసులు నమోదు చేయూలని కోరారు.
నాకెవరూ డబ్బు ఇవ్వలేదు...
హోంగార్డు ఉద్యోగాల కోసం తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని ఏఆర్ కానిస్టేబుల్ మధు చెప్పాడు. బాధితులంతా స్టేషన్‌కు వచ్చిన నేపథ్యంలో వారి ముందుకు ఏఆర్ కానిస్టేబుల్ మధును ఎస్‌ఐ రామారావు రప్పించారు. డబ్బులు విషయమై ప్రశ్నించారు.దీంతో వీరెవరూ తనకు డబ్బులు ఇవ్వలేదని అందరూ అబద్దాలు చెబుతున్నారని చెప్పాడు.
న్యాయం చేస్తాం : ఎస్పీ
లావేరు : హోంగార్డు ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని ఎస్పీ బ్రహ్మారెడ్డి చెప్పారు. లావేరు పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం రాత్రి విచ్చేసిన ఆయన నిరుద్యోగులను మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ మధును స్టేషన్‌లో విచారించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాధిత నిరుద్యోగ యువతకు న్యాయం చేయడం కోసం ఈ కేసును తాను ప్రత్యేకంగా విచారిస్తున్నట్టు తెలిపారు. దీని వెనుక ఎవరెవరున్నదీ అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పారు. జిల్లాలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. జిల్లాలో పేకాటలు, రికార్డింగ్ డ్యాన్స్‌లు, గుట్కా, గంజాయి వంటి అక్రమ వ్యాపారాలపై నిఘా పెట్టామన్నారు. ఆయన వెంట శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, జేఆర్‌పురం సీఐ రామకృష్ణ, లావేరు ఎస్‌ఐ సీహెచ్ రామారావు ఉన్నారు.