– నిర్బంధంలోనూ వైఎస్‌ఆర్‌సీపీ బంద్ విజయవంతం
– విఫలం చేసేందుకు ప్రభుత్వ యత్నం
– జిల్లావ్యాప్తంగా 2 వేల మంది అరెస్టు
– కేసులకు భయపడని ప్రజలు
– స్వచ్ఛందంగా బంద్‌కు సహకారం
– ఆందోళనలతో అట్టుడుకిన పట్టణాలు
– బస్సులు నడిపే యత్నాలు విఫలం
– ఎంపీ బుట్టా రేణుక అరెస్టు, విడుదల
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
గుండె గుండెలో ‘ప్రత్యేక’ ధ్వని.. గొంతు గొంతులో ‘హోదా’ రాగం.. మది మదిలో రణన్నినాదం..ఉద్యమమై..ఉప్పెనై..ఊపిరై..ఉక్కుపిడికిలై రేపటి తరం కోసం శనివారం బంద్ రూపంలో ప్రభవించింది. చైతన్యమై ప్లవించింది. కర్నూలు, నంద్యాల, ఆదోని..పట్టణమేదైనా హోదాగ్రహం ఉధృతమైంది. వాడవాడలా..వీధివీధిలో ఆందోళనలు మిన్నంటాయి. అడుగడుగునా పోలీసులు..అరెస్టులు..కేసులు..మోసాన్ని కప్పిపుచ్చుకునే ప్రభుత్వ ఎత్తుగడలు..అన్నీ చిత్తయ్యాయి. ప్రజల ఆశ, ఆకాంక్ష.. నిరసన రూపంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. అన్ని వర్గాల మద్దతుతో వైఎస్‌ఆర్‌సీపీ బంద్ విజయవంతమైంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో శనివారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతం అయ్యింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉదయం నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్దపైకి వచ్చి బంద్‌ను చేపట్టారు. ఒకవైపు పోలీసులు ముందస్తు అరెస్టులు, కేసులు నమోదు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలోనూ వెరవక బంద్ విజయవంతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు కషిచేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో పోలీసు భద్రతతో ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు ప్రయత్నించారు. స్వయంగా ఎస్పీ ఉదయాన్ని ఆర్టీసీ బస్టాండు వద్దకు వచ్చి పోలీసు బందోబస్తుతో బస్సులను నడిపించేందుకు ప్రయత్నించారు. అయితే, దీనిని పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జిల్లావ్యాప్తంగా నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరులల్లో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం మోసం చేస్తోందని... దీనికి సీఎం చంద్రబాబు సహకరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ప్యాకేజీ పేరుతో వచ్చే నిధుల్లో తమ్ముళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి వాటాలు పంచుకునేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారని విమర్శించారు.
కర్నూలు నగరంలో పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. కర్నూలు ఆర్టీసీ బస్టాండు ఎదుట పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు ఇన్‌చార్జీ హఫీజ్‌ఖాన్‌తో పాటు పార్టీ నేతలు మధుసూదన్, సురేందర్ రెడ్డి, రెహ్మాన్, రాజా విష్ణువర్దన్ రెడ్డి, నాగరాజు యాదవ్, తోట వెంకట కృష్ణా రెడ్డి, విజయకుమారి, రమణ, సలోమి, అనిల్‌కుమార్ తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీ బుట్టా రేణుక కూడా నిరసనలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు ఆమెను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. మరోవైపు వామపక్ష పార్టీల నేతలు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్, రామాంజనేయులు, నిర్మలమ్మతో పాటు కార్యకర్తలు భారీగా తరలివచ్చి బంద్ నిర్వహించారు.
హోదా వచ్చే వరకు పోరాటం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోమన్ రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపుకు స్పందించి విజయవంతం చేసిన అందరికీ కతజ్ఞతలు. ప్రత్యేక హోదాను ప్రజలు ఎంత గట్టిగా కోరుకుంటున్నారనే విషయాన్ని బంద్ జరిగిన తీరు స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా వచ్చే వరకూ అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా వచ్చే వరకు మా పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుంది.
– గౌరు వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు