అధినేతపై ఆశలు
-
వరుస పరాజయాలతో కుదేలైన బీజేపీ
-
నేతల తీరుతోనే జిల్లాలో ఈ దుస్థితి
-
అమిత్ షా పర్యటనతో పార్టీ బలపడుతుందంటున్న నాయకులుl
సాక్షిప్రతినిధి, వరంగల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉంది. బీజేపీకి ఒకప్పుడు జిల్లాలో ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితి ఏర్పడింది. వరుస దారుణ పరాజయాలతో పూర్తిగా కుదేలైంది. సాధరణ ఎన్నికల సంగతి సరేసరి... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నిక ఇలా ప్రతి పోరులోనూ బీజేపీ దారుణంగా ఓటమిపాలైంది. వరుస పరాజయాలతో నిస్తేజమైన బీజేపీ జిల్లాలో ఇప్పట్లో కోలుకునే అకాశాలు కనిపించడం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
పేరుకు జాతీయ పార్టీ అయినా జిల్లాలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఉనికి కనిపించలేదు. జిల్లా నుంచి బీజేపీ తరఫున చట్టసభకు ఎన్నికైన వారు లేకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు చాలా తక్కువ మంది ఉండడంతో పార్టీ విస్తరణ సాధ్యం కావడం లేదు. దశాబ్దాలుగా ఇద్దరు ముగ్గరు నేతలే జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్నారని, వీరి వల్ల పార్టీకి కొత్త నాయకత్వం రావడం లేదని కమలం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్న బీజేపీ.. జిల్లాలో ఆ పని చేయకపోవడం వల్లే పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల నుంచి మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తున్న టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. ఇప్పుడు బీజేపీది కూడా ఇదే తీరుగా ఉంది. జిల్లాలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) ప్రభావం ఎంతమాత్రమూ లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్డీయే కూటమి తరఫున ఎవరో ఒకరు పోటీ చేస్తుండడం సాధారణ ఎన్నికల నుంచి జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేశారు. గత ఏడాది మార్చిలో జరిగిన వరంగల్–నల్లగొండ–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ తరుపున అభ్యర్థి పోటీ చేశారు. అధికార పార్టీతో జరిగిన పోరులో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు.
వరంగల్ లోక్‌సభకు గత ఏడాది చివరలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా బీజేపీకి కనీస స్థాయిలోనూ ఓట్లు దక్కలేదు. 2014 స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ కేవలం 21 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇలా గెలిచిన వారిలో 12 మంది మాత్రమే ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీని విస్తరించడం లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం వరంగల్‌కు వస్తున్నారు. ఎన్నిక రాజకీయంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న అమిత్ షా రాకతో జిల్లాలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.