అనంతపురం మెడికల్ : ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్‌ఎంఏ) పథకం అమలు తీరు తెన్నులను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన ‘సాథి’ ఆర్గనైజేషన్ సభ్యులు సాయిశోభా రాఘవన్, రేబిక సోమవారం సర్వజనాస్పత్రికి వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు గైనిక్, లేబర్, పీడియాట్రిక్, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ, గర్భిణుల ఓపీలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో వైద్యులతో మాట్లాడారు. ప్రతి నెలా 9వ తేదీన పీఎంఎస్‌ఏఓ కార్యక్రమం సజావుగా సాగుతోందా అని ఆరా తీశారు. అనంతరం నగరంలోని నీరుగంటి వీధిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి జననీ సురక్ష యోజన కింద గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. బృందం వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, ఎస్‌ఓ మారుతిప్రసాద్ ఉన్నారు. ఈ బృందం జిల్లాలోని పెనుకొండ, హిందూపురం ఆస్పత్రులను కూడా పరిశీలించింది.