పుంగనూరు ప్రభుత్వ వైద్యశాల.
– రోగులకు పట్టెడన్నం కరువు
– ప్రత్యామ్నయ చర్యలు శూన్యం
ధర్మాసుపత్రిలో రోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. కడుపు నింపుకోవడానికి పట్టెడన్నం కూడా కరువై.... అన్నమో..! రామచంద్రా అంటూ హోటళ్ల వద్దకు పరుగు తీస్తున్నారు. పట్టణానికి దూరంగా ఆస్పత్రి ఉండడంతో ఆటోలో వెళ్లి మరీ భోజనం తెచ్చుకుంటున్నారు. రాత్రిళ్లు అయితే రోగుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. పుంగనూరు ధర్మాసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రోగుల ఆకలి కేకలు శుక్రవారం ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమయ్యాయి.
పుంగనూరు:
కాంట్రాక్టర్ల ధన దాహం.. అధికారుల నిర్లక్ష్యంతో పుంగనూరు ధర్మాస్పత్రికి వస్తున్న పేద రోగులు ఆకలితో అలమటిస్తున్నారు. పుంగనూరు పట్టణానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే ధర్మాసుపత్రికి రోజుకు దాదాపు 100 నుంచి 150 మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఇదిలా ఉండగా ఇక్కడి రోగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందడంలేదు. ఇందుకు గాను సంబంధిత కాంట్రాక్టర్లకు ఒకొక్కరోగికి రూ.40 లు ఇస్తారు. ఇందులో ఉదయం అల్పహారంతో పాటు పగలు, రాత్రి భోజనం రోగులకు అందించాలి. బాలింతలకు బ్రెడ్డు, అరటిపండ్లు కచ్చితంగా పంపిణీ చేయాలి.
ఏడాదిగా ప్రత్యామ్నాయం కరవు
ఆస్పత్రిలో లాభదాయకంగా లేదని కాంట్రాక్టర్ ఏడాది క్రితమే పని మానేశాడు. దీనిపై ఆస్పత్రి అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యామ్నయ చర్యలు చేపట్టకపోవడంతో రోగులు , బాలింతల బాధలు వర్ణణాతీతం. ఆస్పత్రిలో క్యాంటీన్ లేకపోవడం, పట్టణానికి దూరంగా ఆస్పత్రి ఉండడంతో రూ.40ల భోజనం కోసం రూ.100లు ఖర్చు చే యాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. .
ఆకలి కేకలు నిజమే
ఈ విషయమై ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మూర్తి నాయక్‌ను సాక్షి వివరణ కోరింది. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు భోజనం పంపిణీ చేయకపోవడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాలేదంటున్నారని, దీని కోసం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన సమాధానమిచ్చారు.