- జిల్లాలో 59 హాస్టళ్ల మూసివేత
- వీధిన పడ్డ వేలాది మంది విద్యార్థులు
- మొత్తం హాస్టళ్ల మూసివేత దిశగా
- ప్రభుత్వ యోచన?
- మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
‘సంక్షేమం’పై వేటు
Published Fri, Oct 21 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
భానుగుడి (కాకినాడ) :
ప్రభుత్వ చర్యలు పేద విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. అధికారానికి రాక పూర్వం ప్రజా సంక్షేమమే «ధ్యేయమని గొప్పలకు పోయి... ఆనక ఆ సంక్షేమానికే తూట్లు పొడుస్తున్న వైనాన్ని చూస్తే రేవుదాటాక తెప్ప తగులబెట్టిన చందాన్ని గుర్తు చేస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 354 వసతి గృహాలకు మంగళం పాడిన ప్రభుత్వ ధోరణి చూస్తుంటే శాశ్వతంగా సంక్షేమవసతి గృహాలను మూసివేస్తారన్న వాదనలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యను విద్యార్థి సంఘాలతో పాటు, దళిత, బీసీ వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తన పంథాను మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వీధినపడ్డ 2500 మంది విద్యార్థులు
రెండేళ్ల కాలంలో వందలోపు విద్యార్థులున్న వసతి గృహాలను మూసివేయాలన్న నిబంధనతో జిల్లాలో 59 హాస్టళ్లను మూసివేశారు. ఇందులో 33 ఎస్సీ వసతి గృహాల్లోని 1420 మంది విద్యార్థులు వీధిన పడ్డారు. 26 బీసీ వసతి గృహాల్లోని 1100 మంది విద్యార్థులకు వసతి కరువైంది. వచ్చే రెండేళ్లలో నిబంధనలు మరింత కుదించి మొత్తం వసతి గృహాలకు మంగళం పాడాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు, దళిత, బీసీ వర్గాల ప్రజలు ఉద్యమబాట పట్టకుంటే మరింత మంది విద్యార్థులు వీధిన పడి విద్యకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. వసతి గృహాలను మూసివేసి వాటి స్థానే రెసిyð న్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ మాటలు నమ్మసఖ్యంగా లేవు. జిల్లాలో రెండేళ్లలో 59 వసతి గృహాలను మూసివేసిన ప్రభుత్వం ద్రాక్షారామలో ఒకే ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుంది. మూసివేసిన వసతి గృహాలు ఏజెన్సీ ప్రాంతం, తుని మండలాల్లో ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాలతో సంబంధం లేదని ద్రాక్షారామలో రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.
జిల్లాలో మిగిలినవి 138 హాస్టళ్లు
జిల్లాలో ఇంకా 138 వసతి గృహాలు కొనసాగుతున్నాయి. 78 ఎస్సీ వసతి గృహాల్లో 8300 మంది, 60 బీసీ హాస్టళ్లలో 8 వేల మంది విద్యార్థులున్నట్టు అంచనా. రానున్న రోజుల్లో ఈ హాస్టళ్లను మూసివేస్తే 16 వేల మందికి పైగా విద్యార్థులు వీధిన పడే అవకాశం ఉంది.
Advertisement