గంట గంటకు అద్దె
గంట గంటకు అద్దె
Published Sat, Jul 30 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
సాక్షి, అమరావతి :
పుష్కరాలకు వచ్చే భక్తులకు సాధ్యమైనంత వరకూ వసతి సౌకర్యాలు కల్పించడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 24 గంటల చెక్ అవుట్ స్థానంలో గంటల రూపంలో అద్దె వసూలు చేయడానికి హోటల్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. గోదావరి పుష్కరాల సమయంలో 12 గంటల చెక్ అవుట్‌కు జీవో ఇచ్చినట్టుగానే కృష్ణా పుష్కరాలకు కూడా కల్పించాలని హోటల్స్ అసోసియేషన్స్ ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఎటువంటి జీవో జారీ చేయకుండానే అమలు చేయడానికి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా 20 శాతం మించి గదులు తీసుకోమని చెప్పడంతో సామాన్యులకు సాధ్యమైనన్ని గదులు అందుబాటులో ఉంటాయంటున్నారు. కేవలం 12 గంటల చెక్ అవుటే కాకుండా అవసరమైతే గంటల ప్రకారం అద్దె వసూలుచేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రముఖ స్టార్ హోటల్ అధినేత చెప్పడం విశేషం. ఉన్న సమయాన్ని బట్టీ రోజువారీ టారీఫ్‌లో 20 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తక్కువ సమయం ఉన్న వారికి గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తామని, దీనివల్ల గదులు తొందరగా ఖాళీ అయ్యి మరొకరికి అవకాశం ఉంటుందని తెలిపారు. వచ్చే భక్తుల్లో చాలామంది పవిత్ర స్నానంచేసి వెళ్లిపోవడానికే చూస్తారని, అందుకే గంటల ప్రకారం అద్దె వసూలు చేయడం ద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. విజయవాడలో సుమారు 1,700 గదులు ఉండగా, ఇందులో 20 శాతం ప్రభుత్వానికి కేటాయిస్తున్నారు. ఈ గదులకు అద్దెలను వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం విశేషం.
Advertisement
Advertisement