గది..గగనమే !
గది..గగనమే !
Published Thu, Jul 21 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విడిది చేయడానికి హోటల్ గదులు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. విజయవాడలో ఉన్న హోటల్ గదుల్లో అధిక శాతం ప్రభుత్వమే బుక్ చేసుకోనుండడంతో సామాన్యులకు గదులు దొరకని పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి తరలి రావడంతో చాలా గదులలో ఇప్పటికే అధికారులు, మంత్రులు ఉంటున్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం 60 వేల మంది ఉద్యోగులకు బాధ్యతలను అప్పచెప్పింది. ఇవి కాకుండా ప్రొటోకాల్ అధికారులు, జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు అదనపు గదులను కేటాయించాల్సి వస్తోంది. నగరంలో ఉన్న ఫోర్ స్టార్ హోటళ్లలో అత్యధిక శాతం ప్రభుత్వమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్రీస్టార్‌తో పాటు మిగిలిన లాడ్జీల్లో 30 నుంచి 40 శాతం గదులను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని హోటల్ ఓనర్స్ అంచనా వేస్తున్నారు.
గోదావరి పుష్కరాల్లో 30 శాతం గదులు...
గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని హోటళ్లలో 30 శాతం గదులను ప్రభుత్వం తీసుకుందని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో తీసుకునే అవకాశాలున్నాయని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐలాపురం రాజా అన్నారు. నగరంలో మొత్తం 200 హోటళ్లు ఉండగా అందులో మూడు ఫోర్ స్టార్, 8 త్రీస్టార్ హోటళ్లు ఉన్నాయి. అన్ని హోటళ్లలో కలిపి సుమారు 1,700 గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం తీసుకోగా కనీసం వెయ్యి గదులు కూడా మిగలని పరిస్థితి కనిపిస్తోంది. పుష్కర విధుల్లో ఉన్న ఉద్యోగస్తుల్లో చాలామందికి కళాశాలలు, కళ్యాణ మండపాల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నా, ఉన్నతాధికారులు, వచ్చే ముఖ్య అతిథుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గదులను కావాలని కోరుతోంది. గదుల కొరతను తీర్చడానికి 12 గంటల చెక్ ఔట్ సదుపాయం కల్పించాలని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. గోదావరి పుష్కరాలకు ఇదే విధంగా 12 గంటల చెక్ ఔట్ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేశారని, అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నట్లు రాజా తెలిపారు. ఈ సూచనపై ప్రభుత్వం సాను కూలంగా స్పందించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. దీని వల్ల తక్కువగా ఉన్న గదులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటుతో పాటు భక్తులకు ఆర్థికంగా కలిసొస్తుందన్నారు. ధరలు పెంచం..
డిమాండ్ ఉందని గదుల అద్దెలు పెంచే ఆలోచన లేదని ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఇవ్వగా మిగిలిన వాటిని సాధారణ రేట్లకే ఇస్తామని ఫార్చున్ మురళీ హోటల్ అధినేత ఎం.మురళీ కృష్ణ తెలిపారు. ఎవరూ అద్దెలు పెంచే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాము తీసుకునే గదులపై సాధ్యమైనంత డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఇలా ప్రభుత్వానికి ఇచ్చిన డిస్కౌంట్‌ను అద్దెలు పెంచడం ద్వారా సాధారణ భక్తులను నుంచి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వ విధానం స్పష్టం కాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టలేదని హోటల్ ప్రతినిధులు పేర్కొన్నారు.
విజయవాడలో మొత్తం హోటళ్లు, లాడ్జీల సంఖ్య – 200
ఫోర్‌స్టార్ హోటళ్లు–3 (తాజ్ గేట్‌వే, డీవీ మానర్, ఫార్చూన్ మురళీ)
త్రీస్టార్ హోటళ్ల సంఖ్య 8
అందుబాటులో ఉన్న మొత్తం గదులు 1,700
ఫోర్ స్టార్ హోటల్‌లో అద్దె రూ. 4,000 – 6,000 (24 గంటలు)
త్రీ స్టార్ హోటల్‌లోæ అద్దె రూ. 2,000 3,000
లాడ్జీలు రూ. 500 1,500
Advertisement
Advertisement