భక్తులకు భానుడి సెగ
సాక్షి, అమరావతి :
ఆగస్టు నెల వేసవి మాసాన్ని తలపిస్తోంది. వాస్తవంగా అయితే ఇప్పటికే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉంది. అయితే వరుణుడు కరుణించకపోగా.. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆగస్టులో ఆశించినస్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అయితే అనూహ్యంగా ఈశాన్య రుతుపవనాలు తీరాన్ని దాటి వెళ్లిపోవటంతో ప్రస్తుతం వేసవి వాతావరణాన్ని తలపిస్తోంది. గతకొద్దిరోజులుగా ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 34 డిగ్రీలు నమోదైంది.
ఉదయం నుంచే ఎండలు
ఉదయం 7.30గంటల నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు. ఉదయం 10గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మిట్టమధ్యాహ్నం అయితే బయటకు వెల్లేందుకు జనం వెనకడుగేశారు. ఎండ తీవ్రత సాయంత్రం 5.30గంటల వరకు కొనసాగింది. కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్దకు చేరుకున్నా.. ఎక్కువ సమయం ఉండలేక ఇంటిముఖం పట్టటం కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో స్నానానికి దిగిన వారు బయటకు రావటానికి ఇష్టపడలేదు. కొందరు ఎండలకు భయపడి గంటల కొద్దీ నీటిలోనే గడిపారు.
దాహం దాహం..
పుష్కర డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, వాలంటీర్లు మంచినీరు దొరక్క అల్లాడిపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక ఘాట్లలో మంచినీరు ఏర్పాటు చేయకపోవటంతో ఘాట్ల సమీపంలో ఉన్న దుకాణాల్లో వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ కొనుగోలు చేసి గొంతు తడుపుకోవడం కనిపించింది. కొంతమంది సిబ్బంది నదిలో జేసీబీలతో ఇసుకన తోడి ఉన్న గుంటలో ఉన్న నీటితో దాహం తీర్చుకోవటం కనిపించింది. అదే విధంగా విధుల్లో ఉన్న ఉద్యోగులు ఘాట్లలో ఉండలేక చెట్లు, పిండప్రదానం చేసే షెడ్ల వద్దకు చేరుకున్నారు.
కొన్నిచోట్ల టెంట్ల ఏర్పాటు
ఎండ తీవ్రతను గమనించిన అధికారులు కొన్ని ఘాట్లలో టెంట్లు ఏర్పాటు చేశారు. వేసవితాపాన్ని గమనించిన ఎస్ వెంకటేశ్వర్లు దంపతులు సీతానగరం ఘాట్‌కు వెళ్లే మార్గంలో పుచ్చకాయలు కొనుగోలుచేసి వచ్చి వెళ్లే పుష్కర భక్తులకు పండును కోసి ఇవ్వటం కనిపించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 50పుచ్చకాయలను కోసి ఒకటి, రెండు దబ్బలు ఇచ్చి భక్తుల తాపాన్ని తీర్చటం గమనార్హం.