Hot weather
-
కాస్త ఎండ పట్టున ఉండండి..!
ప్రస్తుతం మానవుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పటిలా... రాత్రుళ్లు త్వరగా పడుకుని, ఉదయం త్వరగా లేవడం దాదాపు అసాధ్యంగా మారింది. నగరజీవితం, ఉరుకుల పరుగుల ఉద్యోగాలు, వేళాపాళా లేని ఆఫీసు పనివేళలు దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు ఉదయం అంటే ఏంటో తెలియని దుస్థితికి చేరుకున్నారు. వాకిళ్లు లేని ఇరుకు ఇళ్లు, గూళ్లలాంటి అపార్ట్మెంట్లు కావడంతో సూర్యరశ్మి సోకడం గగనమైపోయింది. కేవలం రాత్రిషిప్టులు చేసేవారే కాదు, పగటిపూట పనిచేసేవారూ సూర్యరశ్మికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నగరాల్లో పెరుగుతోన్న అపార్ట్మెంట్ కల్చర్ కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాగైతే శరీరానికి కావాల్సిన ‘విటమిన్–డి’ అందేది ఎలా? అందుకే ‘కాస్త ఎండ పట్టున ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి’. అవును మానవ శరీరానికి విటమిన్ –డి ఎంతో ముఖ్యమైంది. ఈ విటమిన్ లోపం శరీరంపై చూపే ప్రభావం, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చో ఈ రోజు ‘హెల్త్’లో మీకోసం.. విటమిన్–డి ఎలా తయారవుతుందంటే..! సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్–బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు ‘విటమిన్–డి’ని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో ‘విటమిన్–డి’ హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన ‘విటమిన్–డి’ మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అనారోగ్య సమస్యలు.. శరీరానికి సరిపడ మోతాదులో ‘విటమిన్–డి’ లభించకపోతే తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. దీంతో డయాబెటిస్ వస్తుంది. విటమిన్–డి లోపంతో ఆకలి మందగించడం, బరువు తగ్గటం, నిద్రలేమి వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ఈ కోవలోకి మరో సమస్య వచ్చి చేరింది. అదే తలనొప్పి. విటమిన్డి లోపంతో తలనొప్పి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది స్పష్టంగా కనబడుతుంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు బయట అంతగా గడపకపోవటం, శరీరానికి ఎండ సరిగా తగలక పోవడం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు గుండె, ఊపిరితిత్తులు ఉండే ఎముకల గూడు భాగం(ఉరోస్థి)లో నొప్పిగా ఉండడం, క్షణక్షణానికీ భావోద్వేగాలు మారడం, వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, ఒంటి దురద, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన ఆహారం... విటమిన్ డి లోపాన్ని జయించాలంటే చర్మానికి తగినంత ఎండ తగిలేలా చూసుకోవటమే మంచి చికిత్స. కానీ ఎండ వల్ల తగినంత విటిమిన్ లభించని పరిస్థితి ఉంటే తీసుకునే ఆహార పదర్థాల ద్వారా కూడా కొంతలో, కొంత సమస్యను తగ్గించుకోవచ్చు. విటమిన్ డిని అందించే కొన్ని ఆహార పదార్థాలు... ముష్రుమ్స్ (పుట్టగొడుగులు)... పుట్టగొడుగుల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 కూడా మెండుగా ఉంటుంది. తెల్లని పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్‌డితో పాటు జింక్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. పాలు.. పాలు ‘విటమిన్–డి’ని సమృద్ధిగా అందిస్తాయి. ఒక గ్లాసు పాలలో మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరం. అంతే కాదు పాలలో ‘యాంటీ ఏజింగ్’ లక్షణాలు కూడా ఉంటాయి. గుడ్డు... రోజుకో గుడ్డు తప్పనిసరి అని ఆహార నిపుణులు చెబుతుంటారు. గుడ్డు అంతలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరీ. గుడ్లలో విటిమిన్–డి, విటమిన్ బి12 , ప్రోటీన్లు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి గుడ్డును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. చీజ్... విటమిన్ డి కి మరో మూలాదారం చీజ్. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఎంతో మేలు చేస్తుంది. చేపలు.. విటమిన్–డి అధిక మొత్తంలో లభించే ఆహార పదార్థాల్లో చేపలు మొదటి స్థానంలో ఉంటాయి. చేపలను కనీసం వారానికి ఒకసారైనా కచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్ ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచివి. -
భక్తులకు భానుడి సెగ
సాక్షి, అమరావతి : ఆగస్టు నెల వేసవి మాసాన్ని తలపిస్తోంది. వాస్తవంగా అయితే ఇప్పటికే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉంది. అయితే వరుణుడు కరుణించకపోగా.. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆగస్టులో ఆశించినస్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అయితే అనూహ్యంగా ఈశాన్య రుతుపవనాలు తీరాన్ని దాటి వెళ్లిపోవటంతో ప్రస్తుతం వేసవి వాతావరణాన్ని తలపిస్తోంది. గతకొద్దిరోజులుగా ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 34 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచే ఎండలు ఉదయం 7.30గంటల నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు. ఉదయం 10గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మిట్టమధ్యాహ్నం అయితే బయటకు వెల్లేందుకు జనం వెనకడుగేశారు. ఎండ తీవ్రత సాయంత్రం 5.30గంటల వరకు కొనసాగింది. కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్దకు చేరుకున్నా.. ఎక్కువ సమయం ఉండలేక ఇంటిముఖం పట్టటం కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో స్నానానికి దిగిన వారు బయటకు రావటానికి ఇష్టపడలేదు. కొందరు ఎండలకు భయపడి గంటల కొద్దీ నీటిలోనే గడిపారు. దాహం దాహం.. పుష్కర డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, వాలంటీర్లు మంచినీరు దొరక్క అల్లాడిపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక ఘాట్లలో మంచినీరు ఏర్పాటు చేయకపోవటంతో ఘాట్ల సమీపంలో ఉన్న దుకాణాల్లో వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ కొనుగోలు చేసి గొంతు తడుపుకోవడం కనిపించింది. కొంతమంది సిబ్బంది నదిలో జేసీబీలతో ఇసుకన తోడి ఉన్న గుంటలో ఉన్న నీటితో దాహం తీర్చుకోవటం కనిపించింది. అదే విధంగా విధుల్లో ఉన్న ఉద్యోగులు ఘాట్లలో ఉండలేక చెట్లు, పిండప్రదానం చేసే షెడ్ల వద్దకు చేరుకున్నారు. కొన్నిచోట్ల టెంట్ల ఏర్పాటు ఎండ తీవ్రతను గమనించిన అధికారులు కొన్ని ఘాట్లలో టెంట్లు ఏర్పాటు చేశారు. వేసవితాపాన్ని గమనించిన ఎస్ వెంకటేశ్వర్లు దంపతులు సీతానగరం ఘాట్‌కు వెళ్లే మార్గంలో పుచ్చకాయలు కొనుగోలుచేసి వచ్చి వెళ్లే పుష్కర భక్తులకు పండును కోసి ఇవ్వటం కనిపించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 50పుచ్చకాయలను కోసి ఒకటి, రెండు దబ్బలు ఇచ్చి భక్తుల తాపాన్ని తీర్చటం గమనార్హం. -
ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్
విశాఖపట్నం : ఎండల తీవ్రతపై విశాఖ వాతావరణ కేంద్రం డేంజర్ బెల్స్ మోగించింది. ఇప్పటికే భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. తాజా నివేదికలో ఎండ తీవ్రత మరింత పెరగనుందని పేర్కొంది. మరో రెండు రోజులపాటు తీవ్రమైన ఎండకు వడగాలులు కూడా తోడవుతాయని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకి రాకూడదని హెచ్చరించింది. ఒకటి, రెండు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. -
తిరువూరులో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
విశాఖపట్నం/తిరువూరు, ఛత్తీస్‌గఢ్‌నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, అయితే దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, మరో రెండు రోజులు వేడి సెగలు కొనసాగే అవకాశమున్నట్టు పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం రాష్ట్రంలోని తిరువూరులో గరిష్టంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో పట్టణంలోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు రెంటచింతలలో గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. రెంటచింతల-45.4, రామగుండం-43.8, ఒంగోలు-43.1, నిజామాబాద్-42.8, నెల్లూరు-42.7, తిరుపతి-42.6, నందిగామ-42.1, గన్నవరం-42.1, కావలి-41.4, హైదరాబాద్-40.9, కర్నూలు-40.9, బాపట్ల-40.4, అనంతపురం-40.3