Published
Fri, Jan 20 2017 12:05 AM
| Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
ఇల్లు దగ్ధం
భీమవరం అర్బ న్ : స్థానిక గొల్లవానితిప్ప రోడ్డులోని డేగాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. డేగాపురంలోని యనమదుర్రు కాలువగట్టుపై కుంభా దుర్గారావు 15ఏళ్లుగా కుటుంబంతో నివాసముంటున్నాడు. వివాహాలకు కల్యాణ మండపాలు డెకరేష న్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన దుర్గారావు పిల్లలు, భార్యతో కలిసి బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో డెకరేష న్ వస్తువులు, ఇంట్లోని గృహోపకరణాలు, రూ. 50 వేల నగదు అగ్నికి ఆహూతయ్యాయని దుర్గారావు విలపించారు. సుమారు రూ.లక్షా 80 వేలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు కోరారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి షేక్ జా న్ అహ్మద్ తెలిపారు.