సెల్ఫోన్ పేలితే ఇల్లు కూలుతుందా...?
మదనపల్లి: సెల్ఫోన్ పేలితే ఇల్లు కూలుతుందా... అని మదనపల్లె పట్టణంతోపాటు జిల్లా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలోని గౌతమినగర్లో అన్నపూర్ణ ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఇల్లు కూలిపోయి అన్నపూర్ణ మామ సుబ్రమణ్యం మృతి చెందాడు. సెల్ ఫోన్ పేలడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రజలు మాత్రం ఈ పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏమి జరిగింది, గ్యాస్ సిలిండర్ పేలలేదు... షార్ట్ సర్క్యూట్ జరగడానికి కరెంటు మీటర్ బాగానే ఉంది. బాంబులు వేసినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
మరి అంత పేలుడు ఎలా సంభవించిందన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. సోమవారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గోడ శిథిలాలను తొలగించి పేలుడుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. బాంబులు వేయడం వల్లే గోడ కూలిందా...? లేక ఆ ప్రదేశంలో ఇంటికి అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఇంటిలో ఉంచిన మందు పదార్ధాలు పేలాయా? సుబ్రమణ్యం మాంత్రికుడు కావడంతో ఎవరైనా దుండగులు ఈ దురాగాతానికి పాల్పడ్డారా ? అన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కూలిపోయిన ఇంటిలో నాలుగేళ్ల క్రితం చనిపోయిన సుబ్రమణ్యం చిన్న కుమారుడు మంజుబాబు భార్య ఒక్కతే కాపురం ఉంటోంది. ఆమె కూడా రోజువారి కూలి పనులకు వెళ్తోంది. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.