వరకట్న దాహానికి వివాహిత బలి
తొగుట: వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన మండల పరిధిలోని జప్తిలింగారెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఏఎస్‌ఐ ప్రకాష్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొడ్డు రమేష్‌కు వరంగ ల్ జిల్లా చేర్యాల మండలం గౌరాయిపల్లికి చెందిన హేమలత(24)తో 2011లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. లక్ష నగదు, రెండు తులాల బంగారు నగలు, లాంఛనాలతోపాటు ఎకరంన్నర భూమి ఇచ్చారు.
కొన్నేళ్ళపాటు వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి కూతురు నిఖిత, కొడుకు శివకుమార్ ఉన్నారు. ఈ క్రమంలో భర్త రమేష్ రూ. 4 లక్షల నగదును పుట్టింటి నుంచి తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. గత మార్చి నెలలో మృతురాలి అన్న రాజు పెళ్లి సమయంలో 5 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు ఇచ్చారు. అయినా అదనపు కట్నం విషయంలో తృప్తి చెందని భర్త రమేష్‌తోపాటు అత్త మామలు శ్రీపతి, కనకవ్వలు హేమలతను మరింత వేధించారు.
అదనపు కట్నం తేలేక, వేధింపులను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన హేమలత మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు మంటలను ఆర్పివేశారు. ఆమె సుమారు 95 శాతం శరీరం కాలిపోయింది. చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారు జామున హేమలత తుది శ్వాస విడిం చింది. దీంతో ఇద్దరు చిన్నారులు తల్లిలేనివారిగా మిగిలిపోయారు. చిన్నారులు పరిస్థితిపై పలువురు కంట తడిపెట్టారు.
పోలీసుల పికెటింగ్
వరకట్న వేధింపులు భరించలేక హేమలత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా తొగుట, కుకునూరుపల్లి పోలీసులు గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. మృతురాలి అన్న రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ ప్రకాష్ తెలిపారు.