కట్నం కోసం భార్యను కడతేర్చి..
♦ తానూ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య
♦ నవాబుపేట మండలం గంగ్యాడలో ఘటన
నవాబుపేట: కట్నం కోసం ఓ వ్యక్తి భార్యను హత్యచేసి అనంతరం తానూ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవాబుపేట మండలం గంగ్యాడ గ్రామంలో ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలూరు యాదయ్య(32) రెండేళ్ల క్రితం శంకర్‌పల్లి మండలం జనవాడ గ్రామానికి చెందిన జంగయ్య కూతురు ఉమ (22)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో 3.5 లక్షల కట్నం ఇచ్చిన ఉమ తల్లిదండ్రులు మరో లక్ష తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు. యాదయ్య ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
వీరికి సంతానం లేదు. కొంతకాలంపాటు దంపతుల కాపురం బాగానే సాగింది. ఏడాదిగా యాదయ్యతోపాటు అతడి తల్లిదండ్రులు పర్మయ్య, కిష్టమ్మ, ఆడపడుచులు మంజుల, అనంతమ్మ మిగతా కట్నం డబ్బులు తీసుకురావాలని ఉమను వేధించసాగారు. ఈవిషయమై రెండు నెలల క్రితం ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. త్వరలోనే మిగతా లక్ష రూపాయలు ఇస్తామని ఉమ తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. దీంతో సద్దుమణిగిన వేధింపులు వారంరోజులుగా మళ్లీ ఎక్కువయ్యాయి.
గురువారం రాత్రి యాదయ్య, ఉమ దంపతులు కట్నం విషయమై మరోమారు గొడవపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణ తీవ్రమైంది. యాదయ్య ఉమపై దాడి చేసి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను పక్కనే ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు.
మంటల బాధ తాళలేక కేకలు వేయడంతో పక్కగదిలో నిద్రిస్తున్న యాదయ్య తల్లిదండ్రులు పర్మయ్య, కిష్టమ్మ వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మధ్యాహ్నం యాదయ్య మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ స్వామి, సీఐ రంగా తదితరులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.