కట్నం కోసం భార్యను చంపి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు ఓ భర్త.
ధర్మారం (కరీంనగర్) : కట్నం కోసం భార్యను చంపి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు ఓ భర్త. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వెంకటేశ్, స్వప్న(28)లకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
అయితే గత కొంతకాలంగా వెంకటేశ్ భార్యను మరింత కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యను కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.