'విజయ్‌మాల్యాతో పోలీస్తే వారి అప్పు ఎంత?'
జనగామ: పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా బ్యాంకు ద్వారా పొందిన అప్పుల చిట్టాలో తెలంగాణ రైతుల రుణాలు ఏమాత్రమని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు. జనగామలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. మాల్యాకు ఇచ్చిన అప్పులు ఎలా రాబట్టుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్న బ్యాంకులకు.. కొత్త రుణాలు ఇచ్చి పాతవి రాబట్టుకోవాలంటూ కేంద్రం ఉచిత సలహా ఇచ్చిందని విమర్శించారు. అదే రైతులకు ఇస్తే మాత్రం దివాళా తీస్తారని చెప్పడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో వాటా పెంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధికి 60 శాతం హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం వస్తుందన్నారు. కరువు, ఉపాధి, విద్యారంగాల్లో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయూలని ఉపాద్యాయులకు సూచించారు. అదే సమయంలో జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్‌రాజు, మైస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.