సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జీవితాలే తలకిందులైపోతాయి. తెలివైన వాళ్లు కూడా తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. మహా భారతంలో కీలకపాత్ర పోషించిన శకుని సాక్షాత్తూ గాంధారీ దేవి సోదరుడు. కౌరవులపై పగబట్టి ఉన్న శకుని కౌరవులకు అత్యంత ఆత్మీయుడిగా నటించాడు. తమ కారణంగా తండ్రినీ, సోదరులనూ పోగొట్టుకున్న శకుని మామను దుర్యోధనాదులు గుడ్డిగా నమ్మడం చిత్రమే! కోవర్ట్ ఆపరేషన్లతో కురు వంశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా తనకున్న మాయాద్యూత విద్యతో కౌరవుల మనసులు గెలుచుకున్నాడు శకుని. మొదట్లోనే శకుని మామను కూడా అంతమొందించి, శత్రుశేషం లేకుండా చేసుకుని ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల కౌరవులు తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు.
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం దుర్యోధనుడు ఓ మడుగులో దాగాడు. తనకున్న జల స్తంభన విద్య ద్వారా నీటి అడుగున ఉండగలిగాడు. అప్పుడు ధర్మరాజు అతణ్ణి పిలిచి ‘సుయోధనా! నువ్వు ఒక్కడివి ఉన్నావు. మేం అధర్మ యుద్ధం చేయం. మా అయిదుగురిలో నువ్వు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావో చెప్పు. అందులో నువ్వు గెలిస్తే ఈ యుద్ధంలో పాండవులు ఓడినట్లే’ అన్నాడు. అలా బంగారం లాంటి అవకాశం అంది వస్తే దుర్యోధనుడు ఏం చేయాలి? నీతోనే నేను యుద్ధం చేస్తాను అని తెలివిగా సవాలు విసిరి ఉంటే, యుద్ధం చేయకుండానే దుర్యోధనుడు గెలిచి ఉండేవాడేమో! కనీసం నకుల, సహదేవుల్లో ఏ ఒక్కరితో యుద్ధానికి కాలు దువ్వినా గెలిచేవాడేమో అని కొందరి వాదన. కానీ అలా చేయకుండా భీముడితో యుద్ధానికి సై అన్నాడు. భీముడు యుద్ధ నిబంధనలకు విరుద్ధంగా సుయోధనుని తొడలు విరగకొట్టి, కురు రాజును అంతమొందించాడు.
రామాయణంలోనూ అంతే. వాలిని సంహరించేందుకు రెండో సారి రాముణ్ణి వెంటబెట్టుకుని వెళ్లిన సుగ్రీవుడు తన అన్న వాలిని ఉద్దేశించి, దమ్ముంటే యుద్ధానికి రారా అని సవాల్ విసిరాడు. నిజానికి అంతకు ముందే సుగ్రీవుణ్ణి చావ చితక్కొట్టి పంపించాడు వాలి. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు చిత్రకూట పర్వతానికి పారిపోయి తలదాచుకున్నాడు. అలా పారిపోయినవాడు మళ్లీ యుద్ధానికి కాలుదువ్వాడంటే వాడి వెనకాల ఏదో ఓ బలం ఉందనో, కుట్ర ఉందనో వాలి గుర్తించకపోవడం పెద్ద పొరపాటు. ఓ రాజ్యాధినేత అయి ఉండి, సరిపడా వేగులను కలిగి ఉండి, నిఘా విభాగాల నుండి సమాచారాన్ని రాబట్టుకోవలసిన వాలి... అవన్నీ పక్కన పెట్టి కేవలం ఆవేశంతోనూ, అహంకారంతోనూ దూసుకొచ్చేసి రాముడి బాణానికి నేలకొరిగాడు. కాస్త తెలివిగా ప్రవర్తించి ఉంటే సుగ్రీవుడి తెర వెనుక బలం గురించి తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉండింది కూడా! సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోలేకనే వాలి కథ అలా ముగిసింది.
ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలు తలకిందులు చేసుకున్న వాళ్లు ఈ యుగం లోనూ ఉన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి బ్రిటన్ పారిపోయి అక్కడ తలదాచుకున్న విజయ్ మాల్యా కథ అలాంటిదే! కింగ్‌ఫిషర్ బీరుతో కోట్ల ఆస్తులు గడించాడు. వ్యాపారంలో పాదరసం వంటి విజయ్ మాల్యా తన జీవితంలో ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టాడు. ఓ ప్రైవేటు విమానయాన కంపెనీని కొన్నాడు. అందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. ఆ నిర్ణయమే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని చావుదెబ్బ తీసింది. హాయిగా చేతిలోని చల్లటి వ్యాపారం చేసుకుంటూ, కడుపు చల్లగా ఉంచుకోకుండా నష్టాల్లో ఉన్న రంగంలోకి ఎందుకొచ్చినట్లు అని మాల్యాను ఉద్దేశించి అంతా అనుకున్నారు. మాల్యా ఏదైనా అద్భుతం చేస్తాడని అనుకున్నారు. ఎలాంటి మ్యాజిక్కులూ జరగకుండానే దివాళా తీశాడు. చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేసి, చివరకు ఓ చీకటి ముహూర్తాన బ్రిటన్ పారిపోవలసి వచ్చింది. విమాన యాన రంగం నుంచి అందరూ బయటకు వస్తోన్న సమయంలో మాల్యా ఆ రంగంలోకి రాకపోయి ఉంటే ఈ పాటికి మన దేశంలోనే బ్యాంకులకు లక్షల కోట్లు అప్పు పెంచుకుని దర్జాగా ఉండేవాడేమో!
మన రాష్ట్రానికే చెందిన సత్యం రామలింగరాజు కూడా అంతే కదా! ఆయన ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాడు. దాంతో తృప్తి పడి ఉంటే సరిపోయేది. కానీ అలా చేయ లేదు. లేని లాభాలను కాగితాలపై చూపించి, ఆ లాభాలకు అనుగుణంగా అనవసరంగా పన్నులు కట్టి, ప్రపంచం కళ్లు కప్పాలనుకున్నాడు. చివరకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఓ అబద్ధాన్ని ఎక్కువ కాలం కాపాడలేక దొరికిపోవలసి వచ్చింది.
ప్రపంచ చరిత్రలోనూ ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. కోల్డ్ వార్ ముసుగులో అమెరికా – సోవియట్ యూనియన్‌ల మధ్య జరిగిన పోరాటంలోనూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు రెండు దేశాలనూ దెబ్బతీశాయి. వియత్నాం వార్‌లో చావు దెబ్బతిన్న అమెరికా... అఫ్గాన్ వార్‌లో సోవియట్ యూనియన్‌ను ముగ్గులోకి దింపి ప్రతీకారం తీర్చుకుంది. సోవియట్ పాలకులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయమే సోవియట్ పతనానికి దారి తీసింది. అందుకే... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెప్పేది. దాన్ని ఆచరించగలిగిన వారు ప్రశాంతంగా ఉంటారు. లేని వాళ్లు పతనాన్ని కోరి కొనితెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త!
ఒక్క నిర్ణయంతో...
Published Sun, Jan 23 2022 11:59 PM | Last Updated on Mon, Jan 24 2022 7:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment