ప్రమాద ఘోష | Huge fire in the baby section | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘోష

Feb 18 2017 3:22 AM | Updated on Sep 5 2018 9:47 PM

ప్రమాద ఘోష - Sakshi

ప్రమాద ఘోష

సాయంత్రం నాలుగ్గంటల సమయం.. అది ఘోషా ఆస్పత్రి నవజాత శిశువుల విభాగం..

నవజాత శిశువుల విభాగంలో భారీ అగ్నిప్రమాదం
ఏసీ నుంచి రేగిన మంటలు.. పొగ
భయంతో బిడ్డలతో సహా పరుగులు తీసిన బాలింతలు
తక్షణమే రంగంలోకి దిగి కిందికి తరలించిన ఆస్పత్రి సిబ్బంది
వారి అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం
రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా
షార్ట్‌ సర్క్యూటే కారణమంటున్న అధికారులు



సాయంత్రం నాలుగ్గంటల సమయం.. అది ఘోషా ఆస్పత్రి నవజాత శిశువుల విభాగం.. మూడంతస్తుల ఆ విభాగంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు.. విపరీతమైన పొగ.. ఆ అంతస్తులోని వార్మర్లలో అప్పుడే పుట్టిన శిశువులు.. వారి చెంత తల్లులు ఉన్నారు..
ఒక్కసారిగా రేగిన మంటలు, పొగ.. వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.. భయకంపితులను చేశాయి.. వార్మర్లలో ఉన్న బిడ్డలను పట్టుకొని.. భయంతో పరుగులు తీశారు.. అదే సమయం ఆస్పత్రి సిబ్బంది ఉరుకులు.. పరుగుల మీద వచ్చి.. ఆ అంతస్తులో ఉన్న వారందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.. దాంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది.. ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌స్క్యూట్‌ కారణమని అంటున్నా.. ఇంకేమైనా లోపాలున్నా యేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): పాతనగరంలోని ప్రభుత్వ విక్టోరియా(ఘోషా) ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంతో రోగులు, బాలింతలు హాహాకారాలు పెట్టారు. ఆస్పత్రిలోని నవజాత శిశువుల విభాగంలోని వార్మర్లు ఉండే అంతస్తులోని ఓ ఏసీ మిషన్‌ నుంచి సాయంత్రం 4.10 గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు, ఆ వెంటనే మంటలు రేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అయితే అప్పటికే ఏసీ నుంచి రేగిన మంటలు, నల్లటి పొగ ఆ అంతస్తు మొత్తానికి వ్యాపించడంతో అక్కడే ఉన్న బాలింతలు భయంతో కంపించిపోయారు. ఆ సమయంలో వార్మర్లలో 9మంది శిశువులు ఉన్నారు. తల్లులు తమ బిడ్డలను పట్టుకొని భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది నవజాత శిశువులను, తల్లులను కిందికి తరలించారు. ఆక్సిజన్‌ సిలెండర్ల కనెక్షన్లు తొలగించి.. సిలెండర్లను కిందకు చేర్చారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.

భారీ నష్టం
ప్రాణ నష్టం తప్పినా.. ఆస్తినష్టం మాత్రం భారీగానే వాటిల్లింది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే 12 వార్మర్లు, 7 ఫోటో థెరపీ యంత్రాలు, 7 పల్సాక్సి మీటర్లు, 2 ఆక్సిజన్‌ యంత్రాలు, 3 ఏసీలు దెబ్బతిన్నాయి. నాలుగు వార్మర్లు, మూడు ఫోటో థెరపీ యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. వార్మర్లలో ఉన్న 9 మంది చిన్నారులను కిందకు చేర్చిన తర్వాత.. వారిలో ముగ్గురిని కేజీహెచ్‌కు తరలించి.. మిగిలిన వారిని ఘోషా ఆస్పత్రిలోనే ప్రసూతి వార్డులో ఉంచారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. నిచ్చెన సాయంతో ప్రమాదం సంభవించిన అంతస్తుకు చేరుకుని అద్దాలు పగులగొట్టి కిటికీలు తెరవడంతో అంతవరకు దట్టంకా అలుమున్న నల్లటి పొగ బయటకు వెళ్లిపోయింది. మంటలను అదుపు చేయడంతో పాటు మరింతగా వ్యాపించకుండా ఆ పరిసరాలను పూర్తిగా నీటితో తడిపారు. పగటిపూట కాకుండా అగ్నిప్రమాదం రాత్రి జరిగి ఉంటే  పెను నష్టం వాటిల్లేది. అందరూ నిద్రావస్థలో ఉంటారు కనుక భారీ ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉండేదని అంటున్నారు.

రూ.25 లక్షల నష్టం
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం సంభవించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మలీల చెప్పారు. ఏసీ నుంచి పొగలు, మంట రావడం గమనించి సిబ్బంది వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారన్నారు. వారి అప్రమత్తత కారణంగానే ప్రాణానష్టం తప్పిపోయిందన్నారు. ఏసీలు, వార్మర్లు, ఇతర పరికరాలు కాలిపోవడం వల్ల సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉందని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement