స్వార్థానికి నేలకొరిగి..
ప్రభుత్వభూముల్లో భారీ వృక్షాల్ని కూలగొడుతున్న అక్రమార్కులు
మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం
పిఠాపురం : ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలబడే సైన్యమది. భారీ వరదలను సైతం తట్టుకుని నిలదొక్కుకున్న ఆ వృక్షాలు.. అక్రమార్కుల ధనదాహానికి మాత్రం నేలకొరుగుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు చెందిన భూముల్లోని వృక్షాలను స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పిఠాపురం బ్రాంచి కెనాల్, ఏలేరు నీటి పారుదల శాఖ పరిధిలో భారీ వృక్షాలను కొద్ది రోజులుగా కొల్లగొడుతున్నారు.
ఎలా జరుగుతోందంటే..
పంట కాలువల గట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా, పోరంబోకు భూముల్లో ఉన్న చెట్లను అక్రమార్కులు గుర్తిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా వాటిని నరికేస్తున్నారు. ఎవరైనా అడిగితే.. రోడ్డు విస్తరణ, కాలువల అభివృద్ధి కోసం తొలగిస్తున్నట్టు నమ్మిస్తున్నారు.
నెల రోజులుగా ఏలేరు కాలువకు ఇరువైపులా ఉన్న 38 భారీ వృక్షాలను కూలగొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. వీటి విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటిని కొన్ని సామిల్లులకు తరలించి, విక్రయిస్తున్నట్టు తెలిసింది. కొందరు వ్యాపారులు కాలువ పక్కనున్న పొలాల్లో చెట్లను కొనుగోలు చేసి, పనిలోపనిగా కాలువ గట్లపై ఉన్న చెట్లను నరికేస్తున్నారు. చెట్టు నరికాక ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువగా రాత్రివేళ చెట్లు నరుకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇందుకోసం ఉదయం పూటే చెట్ల మొదళ్ల వద్ద శుభ్రం చేసుకుంటున్నారు.
గట్లకు తూట్లు
చెట్లను కొట్టవేయడం ద్వారా అక్రమార్కులు.. పంటకాలువల గట్లుకు తూట్లు పొడుస్తున్నారు. దీనివల్ల గట్లు బలహీనపడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఏ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మొదలు నరికేందుకు గట్లను తవ్వేస్తుండడంతో.. నీటి ఉధృతికి గట్లు తెగిపోవడం ఖాయమని అంటున్నారు.
పట్టించుకోని అధికారులు
ఇటీవల పిఠాపురం-ఉప్పాడ, పిఠాపురం-సామర్లకోట ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా ఉన్న అనేక వృక్షాలను కొందరు అక్రమంగా తరలించుకుపోయారు. పిఠాపురం-ఉప్పాడ రోడ్డులో ఇరిగేషన్ శాఖకు చెందిన పంటకాలువలకు ఇరువైపులా ఉన్న చెట్లను పట్టపగలే నరికి, తరలించుకుపోయినా అధికారులు పట్టించుకోలేదు. కిర్లంపూడి నుంచి పిఠాపురం వరకు ఉన్న ఏలేరు కాలువకు ఇరువైపులా మామిడి, చింత, సుబాబుల్, జీడిమామిడి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిలో అత్యంత భారీ వృక్షాలను నెల రోజులుగా కూల్చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చెట్ల నరికివేతపై అధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు.
విచారణ జరిపిస్తాం
ఏలేరు, పీబీసీ కాలువ గట్లపై చెట్లను నరికేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. సొంత భూముల్లో ఉన్న చెట్లను రైతులే నరుకుతున్నట్టు భావిస్తున్నాం. కాలువగట్లపై చెట్లను కూల్చడం నేరం. దీనిపై విచారణ జరిపిస్తాం. చెట్ల నరికివేతకు ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేవు. చెట్ల తొలగింపులో అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణ నిజం కాదు. - కృష్ణారావు, ఇరిగేషన్ డీఈ, ఏలేరు సెక్షన్