భౌతిక శాస్త్ర చిక్కుముడులు విప్పేద్దాం!
భౌతిక శాస్త్ర చిక్కుముడులు విప్పేద్దాం!
Published Sun, Jan 8 2017 1:41 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
♦ భూగర్భంలో భారీ ప్రయోగశాల
♦ రెండు కిలోమీటర్ల పొడవైన సొరంగం
♦ 5 కోట్ల కిలోల ఇనుప పలకలతో డిటెక్టర్
♦ తమిళనాడులోని థేనీ జిల్లాలో ఏర్పాటుకు భారత ప్రభుత్వం సిద్ధం
♦ విద్యార్థులకు అపార అవకాశాలు
♦ సైన్స్ కాంగ్రెస్‌లో వెల్లడించిన శాస్త్రవేత్తలు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్మించనున్న భారీ సైన్స్ ప్రాజెక్ట్ ‘ఇండియా న్యూట్రినో అబ్జర్వేటరీ’ అనేక విధాలుగా ప్రత్యేకమైందని, ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ చేపట్టని విధంగా ఇక్కడ ప్రయోగాలు జరగనున్నాయని శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో తెలిపారు. సకాలంలో దీన్ని ప్రారంభించగలిగితే శాస్త్ర రంగంలో ఎంతో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ చివరి రోజున ఇండియా న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్‌వో)పై ప్రత్యేక సదస్సు జరిగింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్త అమోల్ దీఘే, ఐఐటీ బాంబే, మద్రాస్‌లకు చెందిన అధ్యాపకులు ఎస్.ఉమాశంకర్, ప్రఫుల్ల కుమార్ బెహరా, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డి.ఇందుమతి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులోని సంక్లిష్టత, వాటిని అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి వక్తలు వివరించారు. సుదూర విశ్వం నుంచి నిరంతరం దూసుకొచ్చే ఒక రకమైన అదృశ్య కణాలను న్యూట్రినోలు అంటారని, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే భౌతికశాస్త్రంలో ఇప్పటివరకూ ఉన్న కొన్ని చిక్కుముడులు విడిపోతాయన్నది తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ దిశగా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి కూడా. అయితే వీటన్నింటికంటే భారత అబ్జర్వేటరీ చాలా భిన్నమైంది.
5 కోట్ల కిలోల ఇనుముతో ప్రయోగాలు..
భారత న్యూట్రినో అబ్జర్వేటరీలో ప్రధాన భాగం ఐకాల్ డిటెక్టర్. ఇతర కణాల నుంచి న్యూట్రినోలను పరోక్ష పద్ధతిలో గుర్తించేందుకు దీన్ని వాడతారు. ఈ డిటెక్టర్ దాదాపు నాలుగు అంతస్తుల ఎత్తు సైజులో ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కటి నాలుగు టన్నుల బరువుండే 30 వేల ఇనుప పలకలను పొరలు పొరలుగా అమర్చడం ద్వారా ఈ డిటెక్టర్‌ను నిర్మిస్తారు. మొత్తమ్మీద ఈ డిటెక్టర్ దాదాపు 5 కోట్ల కిలోల బరువు ఉంటుంది. ఇనుప పలకల మధ్య ప్రత్యేకంగా తయారు చేసిన గాజు ఫలకాలు...వాటి మధ్య దాదాపు రెండు లక్షల ఘనపు లీటర్ల వాయువులతో ఈ భారీ ప్రయోగశాల ఉంటుందని ప్రొఫెసర్ అమోల్ దీఘే వివరించారు. తమిళనాడులోని థేనీ జిల్లాలోని పొటిపురం గ్రామం వద్ద ఉన్న భారీ కొండ అడుగు భాగంలో ఈ అబ్జర్వేటరీ ఏర్పాటవుతుందని, ఈ కొండ పైభాగంలో ఉన్న భారీ ఏకశిల భూ వాతావరణంలో ఉన్న కొన్ని ఇతర న్యూట్రినోలు ప్రయోగశాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని ప్రొఫెసర్ డి.ఇందుమతి వివరించారు. కొండ శిఖరం నుంచి 1.5 కిలోమీటర్ల లోతులో ఈ అబ్జర్వేటరీ ఏర్పాటవుతోందని, రెండు కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా ఈ ప్రయోగశాలలోకి ప్రవేశించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
విద్యార్థులకు అవకాశాలు...
న్యూట్రినో అబ్జర్వేటరీ ద్వారా భౌతికశాస్త్రంలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. తొమ్మిదేళ్లుగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది కూడా. ప్రయోగశాల నిర్మాణానికి సంబంధించి వందకుపైగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలసి పనిచేస్తున్నామని, డిటెక్టర్‌లో ఉపయోగించే ఇనుప, గాజు ఫలకాలను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తున్నామని టీఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. జపాన్‌తోపాటు కొన్ని ఇతరదేశాల్లో ఉన్న అబ్జర్వేటరీల కంటే భిన్నమైన, ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని పద్ధతుల్లో తాము న్యూట్రినోల గుర్తింపునకు ప్రయోగాలు చేస్తున్నామని ప్రొఫెసర్ ప్రఫుల్ల కుమార్ బెహరా వివరించారు.
Advertisement
Advertisement